హైదరాబాద్: చెన్నై వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 26 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ప్రారంభంలో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు మెరుపు క్యాచ్‌లతో అభిమానులను ఎంతగానో అలరించారు.
అయితే మ్యాచ్ సాగే కొద్దీ సులువైన క్యాచ్‌లను సైతం నేలపాలు చేశారు. రహానే అవుటైన తర్వాత టీమిండియా కెప్టెన్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ఇన్నింగ్స్ 5.1 ఓవర్ వద్ద కౌల్టర్ నైల్ వేసిన బంతిని కోహ్లీ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా బాదాడు. అదే సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న మ్యాక్స్‌వెల్ జంప్ చేసి ఒంటిచేత్తో దానిని అందుకున్నాడు.
మాక్స్‌వెల్ అద్భుతమైన క్యాచ్‌తో కెప్టెన్ కోహ్లీ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్ స్లిప్‌లో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఇచ్చిన సులువైన క్యాచ్‌ల్ని అందుకోవడంలో ఘోరంగా విఫమయ్యాడు. ముఖ్యంగా పాండ్యాకు స్మిత్ లైఫ్ ఇచ్చాడనే చెప్పాలి.
స్మిత్ ఇచ్చిన లైఫ్‌తో పాండ్యా (66 బంతుల్లో 83; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులు సాధించడంతో పాటు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత్ జట్టులో కూడా ఇదే తరహాలో రెండు క్యాచ్‌లు మిస్ అవగా.. ఒక కష్టతరమైన క్యాచ్‌ని జస్‌ప్రీత్ బుమ్రా అందుకున్నాడు.
పాండ్యా బౌలింగ్‌లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ బ్యాక్‌వర్డ్ స్కైర్‌లెగ్ దిశగా గాల్లోకి లేపాడు. బంతిని గమనిస్తూ వెనక్కి పరుగెత్తుతూ వెళ్లిన బుమ్రా చక్కగా బంతిని ఒడిసిపట్టుకున్నాడు. మ్యాచ్ చివర్లో ఫీల్డర్లు మనీశ్ పాండే, రహానేలు మాత్రం చెరో క్యాచ్‌ని బౌండరీ లైన్ వద్ద జారవిడిచారు.
ఏది అయితేనేం... తొలి వన్డేలో క్యాచ్‌లు జారవిడిచినప్పటికీ... ఆసీస్‌పై టీమిండియా 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. సెప్టెంబర్ 21 (గురువారం) నాడు రెండో వన్డే కొల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.