హైదరాబాద్: టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ బెంగుళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను వెక్కిరించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ టెస్టులో స్టీవ్ స్మిత్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఇషాంత్ శర్మ పదే పదే ప్రయత్నించాడు. ప్రతి బంతికీ స్మిత్ వైపు గుర్రుగా చూస్తూ అతడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.
అందులో భాగంగా అదోలా వింతగా మొహం పెట్టి స్మిత్‌ను అనుకరించాడు. ఇప్పుడు ఇషాంత్ విసిరిన చాలెంజ్‌ను టీవీ కామెంటేటర్లు స్వీకరించారు. దానికి తగ్గట్టుగానే అనుకరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇషాంత్ గేమ్ ఫేస్ ఛాలెంజ్ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను పోస్టు చేసి ఓ వీడియో హల్ చల్ చేస్తోంది.
స్మిత్‌ను ఏవిధంగానైతే ఇషాంత్ శర్మ రెచ్చగొట్టాడో అదే తరహాలో కామెంటేటర్లు ముఖం పెట్టారు. ఈ వీడియోలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్‌తో పాటు మాజీలు బ్రెట్ లీ, మాథ్యూ హేడెన్‌లు ఉన్నారు. వీరితో పాటు భారత క్రికెటర్లు సంజయ్ మంజ్రేకర్, రవిశాస్త్రితో పాటు మహిళా కామేంటేటర్ మాయంతి లాంగర్ కూడా ఉన్నారు.
బెంగుళూరు వేదికగా జరిగిన రెండో టెస్టులో జరిగిన ఈ సంఘటన కెప్టెన్ స్మిత్‌కు ఆగ్రహాన్ని కలిగించింది. కానీ ఆ మ్యాచ్‌లో ఇషాంత్ చేష్టలను చూసి టీమిండియా కెప్టెన్ కోహ్లి నవ్వుకున్నాడు. ఇషాంత్ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై మీ కామెంట్ చెప్పండంటూ కొందరు ఈ ఫొటో షేర్ చేశారు. క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్ సైట్ కూడా ఈ ఫొటోను తమ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం విశేషం.