
హైదరాబాద్: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ పట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టు, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో టీ విరామం అనంతరం ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో పీటర్ హ్యాండ్స్ కోంబ్ (7) పరుగుల వద్ద విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
పీటర్ హ్యాండ్స్ కోంబ్ క్యాచ్ వీడియో మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 55వ ఓవర్ తొలి బంతిని పీటర్ హ్యాండ్స్ కోంబ్ థర్డ్ మ్యాన్ దిశగా హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి స్లిప్‌లోకి దూసుకెళ్లగా.. మెరుపు వేగంతో స్పందించిన విరాట్ కోహ్లీ కుడి చేత్తో అమాంతం గాల్లోకి ఎగిరి క్యాచ్‌గా అందుకున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, అచ్చం కోహ్లీలాగే భారత మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ శనివారం కళ్లుచెదిరే క్యాచ్ అందుకుంది. బిగ్ బాష్ టోర్నీలో భాగంగా శనివారం అడిలైడ్ స్ట్రైకర్స్-సిడ్నీ థండర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ తరఫున ఆడుతోన్న హర్మన్‌ప్రీత్ కౌర్ అడిలైడ్ స్ట్రైకర్స్ ఓపెనర్ తాహ్లియా మెక్‌గ్రాత్ ఇచ్చిన క్యాచ్‌ను అమాంతం గాల్లోకి ఎగిరిమరీ పట్టింది. రెనె ఫెర్రెల్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో తాహ్లియా మెక్‌గ్రాత్ దూకుడుగా ఆడే క్రమంలో బంతిని గాల్లోకి లేపింది.
అదే సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న హర్మన్‌ప్రీత్ గాల్లోకి ఎగిరిమరీ ఆ బంతిని క్యాచ్‌గా అందుకుంది. అద్భుతమైన క్యాచ్‌ని అందుకున్న హర్మన్‌ప్రీత్‌కి జట్టులోని సహచర క్రికెటర్లు కూడా అభినుందనలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.