
హైదరాబాద్: ప్రస్తుతం భారత క్రికెటర్లు పెళ్లిళ్ల బాట పడుతున్నారు. ఇటీవలే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మను పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం ఢిల్లీ, ముంబైలలో క్రికెటర్లతో పాటు బాలీవుడ్ ప్రముఖులకు వివాహ విందు ఇచ్చాడు.
కోహ్లీకి ముందు టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్, మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్‌లు పెళ్లి చేసుకోగా తాజాగా ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా వారి సరసన చేరనున్నాడు. బుధవారం (డిసెంబర్ 27)న తన ప్రేయసి పంకురి శర్మను ముంబైలో పెళ్లిచేసుకోనున్నాడు.
ముంబైలోని శాంట క్రూజ్ హోటల్‌లో తమ వివాహం జరగనుందని కృనాల్ పాండ్యా ఇప్పటికే అభిమానులతో వెల్లడించాడు. అతి కొద్దిమంది దగ్గర బంధువుల సమక్షంలో తమ పెళ్లి జరగనున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉంటే మంగళవారం కృనాల్ పాండ్యా మెహందీ ఫంక్షన్ ఘనంగా జరిగింది.
ఈ ఫంక్షన్‌లో కృనాల్ తమ్ముడు, టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. అన్న కృనాల్ పాండ్యాతో కలిసి పంజాబ్ మ్యూజిక్‌కు చేసిన ఈ డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ మెహిందీ ఫంక్షన్‌లో మరో యువ క్రికెటర్ మనీష్ పాండే కూడా పాల్గొన్నాడు.