
హైదరాబాద్: నాటింగ్‌హామ్ వేదికగా గురువారం వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పట్టిన ఓ క్యాచ్ 1983 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కపిల్ దేవ్ ఐకానిక్ క్యాచ్‌ని గుర్తుకు తెచ్చింది. 289 పరుగుల లక్ష్య చేధనలో వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్ ఇన్నింగ్స్‌ని దూకుడుగా ఆరంభించారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
39వ ఓవర్ ఐదో బంతిని మిచెల్ స్టార్క్ పుల్ టాస్‌గా విసరగా క్రీజులో ఉన్న ఆండ్రీ రస్సెల్ బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. బంతి గమనాన్ని చూసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ వెనుకకు పరిగెత్తుకుంటూ వెళ్లి అమాంతం ఒడిసిపట్టుకున్నాడు. దీంతో రస్సెల్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు.
లార్డ్స్ వేదికగా జరిగిన 1983 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో వివ్ రిచర్డ్స్ బాదిన షాట్‌ని కూడా కపిల్ దేవ్ కూడా ఇలాగే పరిగెత్తుకుంటూ అమాంతం ఒడిసి పట్టుకున్న సంగతి తెలిసిందే. అప్పటి మ్యాచ్‌లో కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియా విజయం సాధించిన తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది.
కాగా, గురువారం నాటి మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 288 పరుగులకు కుప్పకూలింది. ఆసీస్ జట్టులో కౌల్టర్-నైల్(92; 60 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు), మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (103 బంతుల్లో 73; 7 ఫోర్లు), అలెక్స్ క్యారీ (55 బంతుల్లో 45; 7 ఫోర్లు) రాణించారు.
విండిస్ బౌలర్లలో కార్లోస్ బ్రాత్‌వైట్ (3/67) మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేధనలో షై హోప్ (105 బంతుల్లో 68; 7 ఫోర్లు), నికొలస్ పూరన్ (36 బంతుల్లో 40; 5 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ హోల్డర్ (57 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్) రాణించినా విండిస్ 9 వికెట్లకు 273 పరుగులే చేయగలిగింది. దీంతో ఆస్ట్రేలియా 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.