హైదరాబాద్: భారత్, శ్రీలంక జట్ల మధ్య బుధవారం జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొని బౌండరీలతో హోరెత్తించిన దిల్షాన్ మునవీర (53: 29 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులు) అవుటైన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో బంతిని షాట్ కొట్టే ప్రయత్నంలో మునవీర క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ సమయంలోనే అతని బ్యాట్ చేజారి మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న బుమ్రా వైపు దూసుకెళ్లడం మ్యాచ్ చూస్తున్న అభిమానులను భయాందోళనకి గురి చేసింది.

వర్షం కారణంగా గంట ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. టెస్టు సిరిస్‌ను 3-0, వన్డే సిరిస్‌ను 5-0తో చేజార్చుకున్న ఆతిథ్య శ్రీలంక ఏకైక టీ20లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆరంభం నుంచే హట్టింగ్ చేస్తూ కనిపించారు. ఇందులో భాగంగా మునవీర భారీ షాట్లు బాదాడు.
అయితే కుల్దీప్ వేసిన స్ట్రయిట్ డెలివరీని సరిగ్గా అర్ధం చేసుకోకపోవడంతో వికెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఏకైక టీ20కి ముందు వర్షం పడటంతో గాల్లోని తేమ.. పిచ్ స్వభావం కొంచెం మారి ఉండటంతో బంతి అతను ఊహించిన దానికంటే తక్కువ ఎత్తులో వచ్చింది.
దీంతో మిడ్ వికెట్ దిశగా షాట్ కోసం మునవీర ప్రయత్నించగా.. బంతి అతని బ్యాట్‌కి అందకుండా నేరుగా వికెట్లను గిరాటేసింది. అతను బ్యాట్ ఊపిన వేగానికి.. అది కాస్తా.. పట్టుజారి స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న బుమ్రాకి సమీపంలో పడింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.