

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన రెండో సిరీస్ లోని రెండో మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ చేతిలో భారత్ పరాజయాన్ని చవిచూసింది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య శనివారం రాత్రి ఆసక్తికరంగా వన్డే మ్యాచ్ జరుగుతోంది. టీమిండియా మణికట్టు స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జోరూట్ సెంచరీవైపు దూసుకెళ్తుండగా.. ఆ జట్టు భారీ స్కోరుకి బాటలు వేసుకుంటోంది.
ఈ తరుణంలో అనూహ్యంగా మైదానం నుంచి ఓ కెమెరా కన్ను స్టేడియంలోని గ్యాలరీలో కూర్చుని ఉన్న ఓ ప్రేమజంట వైపు వెళ్లింది. స్టేడియంలోని పెద్ద తెరలపై లైవ్‌లో తాము కనిపించడంతో వెంటనే లేచిన ప్రేమికుడు.. పక్కనే ఉన్న అమ్మాయికి రింగ్‌తో ప్రపోజ్ చేశాడు. కాసేపు ఆశ్చర్యానికి గురైన ఆ యువతి.. ఎట్టకేలకి అతడి ప్రేమని అంగీకరించింది.
ఇది మొత్తం లైవ్‌లో టెలికాస్ట్ కావడం విశేషం. పైగా ఆ వీడియోతో పాటుగా డైలాగ్‌లు కూడా ప్రసారం చేయడంతో.. అతను ప్రపోజ్ చేశాడు. నిర్ణయం పెండింగ్‌లో ఉంది. ఆమె ఒప్పుకుంది అంటూ వీక్షకులకు మరింత సౌకర్యవంతగా ఉండటంతో.. 'లైవ్ లవ్ ప్రపోజల్'గా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
లక్ష్యఛేదనలో తడబడిన భారత్ 50 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. రైనా (46; 63 బంతుల్లో ఒక ఫోర్), కోహ్లి (45; 56 బంతుల్లో 2ఫోర్లు) రాణించారు. ప్లంకెట్ (4/46), రషీద్ (2/38), విల్లీ (2/48) భారత్‌ను దెబ్బతీశారు. రూట్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ధోని (37; 59 బంతుల్లో 2ఫోర్లు), హార్దిక్ పాండ్య (21) క్రీజులో ఉన్నప్పుడు భారత్ కాస్త ఆశతోనే ఉంది.
కానీ 39వ ఓవర్లో పాండ్య ఔట్ కావడంతో అది కూడా పోయింది. ధోని 47వ ఓవర్‌కు వరకు క్రీజులోనే ఉన్నా భారత్ ఏ దశలోనూ గెలిచేలా కనపడలేదు. కష్టంగా పరుగులొచ్చాయి. ధోని ఆట ఓటమి అంతరాన్ని తగ్గించడానికి సరిపోయిందంతే. టెయిలెండర్ల నుంచి ఎలాంటి ప్రతిఘటనా లేదు. దీంతో.. మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమవగా.. సిరీస్ విజేత నిర్ణయాత్మక మూడో వన్డే మంగళవారం జరగనుంది.