చెన్నై : ఐపీల్ తరహాలోనే ఇప్పుడు తమిళనాడు ప్రీమియర్ లీగ్ కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. క్రికెట్ లోకి లోకల్ టాలెంట్ ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ టీఎన్ పీల్ ను ఐపీఎల్ కు ఏమాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తోంది తమిళనాడు క్రికెట్ అసోసియేషన్.
ఈ నేపథ్యంలోనే పలువురు అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లతో టీపీఎల్ ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. ఇదే క్రమంలో మంగళవారం నాడు చెన్నైలో అడుగుపెట్టారు విండీస్ సిక్సర్ల వీరుడు క్రిస్ గేల్ మరియు ఆల్ రౌండర్ బ్రావో. వీరిద్దరికి చెన్నై ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది.
ముఖ్యంగా చెన్నైలోని వేలమ్మల్ ప్రాంతంలో వందలాది మంది స్కూల్ పిల్లలు గేల్ కు గ్రాంగ్ కు వెల్ కమ్ పలికారు. గేల్ ను చూడడానికి విద్యార్థులంతా ఉత్సాహం కనబరిచారు. ఫోటోలు తీసుకునేవాళ్లు, కేరింతలు కొట్టేవాళ్లు.. ఇలా ఓ హీరోను చూసిన ఆనందంలో మునిగిపోయారు వాళ్లంతా. దీనికి సంబంధించిన వీడియోను గేల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.
చెన్నైలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొనేందుకు ఈ ఇద్దరు క్రికెటర్లు హజరయ్యారు. ఇక బ్రావో అయితే పలువరు విద్యార్థినులతో కలిసి సరదాగా స్టెప్స్ వేశాడు. బ్రావోను అనుసరిస్తూ.. విద్యార్థినులు కూడా స్టెప్పులు వేయడంతో అక్కడి వాతావరణం అంతా ఫుల్ జోష్ గా మారిపోయింది. ఇదే వీడియోను బ్రావో కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.