
టీమిండియా మిడిలార్డర్ ప్లేయర్ రిషబ్ పంత్ టీ20ల్లో కూడా రాణించాలంటే అతన్ని ఓపెనర్‌గా ప్రయోగించాలని మాజీ బ్యాటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. 2017లో ఇంగ్లాండ్‌తో ఇండియాలో జరిగిన టీ20 సిరీస్‌లో పంత్ టీ20ల్లో అరంగేట్రం చేశాడు. కానీ టీ20ల్లో అతను అంత ప్రభావవంతంగా ఆడలేకపోతున్నాడు. టెస్టుల్లో మాత్రం విలువైన ప్లేయర్‌గా తనను తాను నిరూపించుకున్న పంత్.. టీ20ల్లో మాత్రం విఫలమవుతున్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఈ లెఫ్ట్ హ్యాండర్ ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) తరఫున రాణిస్తున్నా.. టీమిండియా తరఫున మాత్రం నిలకడగా ఆడటం లేదు.
పంత్ టెస్ట్ క్రికెట్‌లో అనూహ్యంగా రాణిస్తూ.. ఇప్పటికే ఐదు సెంచరీలు చేశాడు. కానీ వన్డేలు, టీ20ల్లో మాత్రం అతని నుంచి స్థాయికి తగ్గ ప్రదర్శనలు రావట్లేదు. ఈ క్రమంలో వసీం జాఫర్ మాట్లాడుతూ.. పంత్ నిలదొక్కుకోవడానికి తొలుత కొన్ని బంతులు తీసుకుంటాడని అందువల్ల అతన్ని ఓపెనర్‌గా ప్రయోగిస్తే.. సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నాడు.
ఇక ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 24 ఏళ్ల పంత్ కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ.. ప్లేయర్‌గా తన మార్క్ చూపించలేకపోయాడు. ఇక ఇప్పటివరకు ఇండియా తరఫున 48 టీ20 మ్యాచ్‌లు ఆడిన పంత్ 23.15సగటుతో, 123.91 స్ట్రైక్ రేట్‌తో మూడు హాఫ్ సెంచరీలతో 741పరుగులు మాత్రమే చేశాడు. ఇక టీ20ల్లో, వన్డేల్లో నిరూపించుకోవడానికి పంత్ ముందు మరో అవకాశం ఉంది. ఇప్పుడు జులై 7న గురువారం ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో పాల్గొనడానికి పంత్ సిద్ధమయ్యాడు. ఆ తర్వాత వన్డేల్లోనూ అతను ఆడనున్నాడు. ఈ సందర్భంగా వసీం జాఫర్ ట్విట్టరులో స్పందిస్తూ.. 'భారత జట్టు మేనేజ్ మెంట్.. టీ20లలో రిషబ్ పంత్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించే విషయం గురించి ఆలోచించాలి. అతను ఓపెనర్‌గా సక్సెస్ కాగలడని నేను భావిస్తున్నాను.' అని జాఫర్ ట్వీట్ చేశాడు.
ఇకపోతే సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్‌లో ఇంగ్లాండ్ ఇండియా మధ్య తొలి టీ20 మ్యాచ్ గురువారం (రేపు) జరగనుంది. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్, లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియాల్లో వరుసగా జూలై 9, జూలై 10వ తేదీల్లో రెండు, మూడు టీ20లు జరగనున్నాయి