
ముంబై: దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడా అరుదైన ఘనతను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా తరఫున అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా గుర్తింపు పొందాడు. కరాచిలో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆటలో హసన్ అలీని ఔట్ చేయడం ద్వారా రబడా ఈ ఘనతను అందుకున్నాడు. రబడా 44 మ్యాచ్‌ల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకోగా.. సఫారీ వెటరన్ పేసర్ డేల్ స్టెయిన్ 39 మ్యాచ్‌ల్లో, అలెన్ డోనాల్డ్ 42 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించారు. ఇక పాక్ స్పిన్నర్ యాసిర్ షా 33 టెస్ట్‌ల్లో 200 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
టెస్ట్ ఫార్మాట్‌లో 200 వికెట్లు తీసిన వారిలో కగిసో రబాడా (40.8) అత్యుత్తమ స్ట్రైక్‌రేట్ కలిగిన బౌలర్‌గానూ రికార్డు నెలకొల్పాడు. ఈ విషయంపై భారత మాజీ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్ స్పందించాడు. 'టెస్టుల్లో 200 వికెట్లు తీసిన రబాడాకు అభినందనలు. అది కూడా ఈ ఫార్మాట్‌లో అత్యుత్తమ స్ట్రైక్‌రేట్ సాధించిన దిగ్గజాల్లో ఒకడిగా నిలిచాడు. అయితే ఇప్పుడు రబాడా వయస్సు 25 ఏళ్లే. భవిష్యత్‌లో అతడు సాధించేది ఆలోచిస్తే భయమేస్తుంది' అని ఓ క్రీడా సంస్థ పోస్టు చేసిన ట్వీట్‌కు జాఫర్ బదులిచ్చాడు.
200 వికెట్లకు కగిసో రబడా 8154 బంతులు వేయగా.. ఈ జాబితాలో మూడో పేసర్‌గా గుర్తింపుపొందాడు. పాకిస్థాన్ దిగ్గజ పేసర్ వకార్ యూనిస్ 7730 బంతులకే ఈ ఘనతను అందుకోగా.. డేల్ స్టెయిన్ 7848 బంతుల్లో ఈ మైలురైయి అందుకున్నాడు. ఇక 200 వికెట్లు తీసిన 8వ సౌతాఫ్రికా బౌలర్‌గా కూడా రబడా గుర్తింపు పొందాడు. డేల్ స్టెయిన్ (439) హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా ఉండగా.. షాన్ పొలాక్ (421), మఖయా ఎన్తినీ (390), అలాన్ డొనాల్డ్ (330), మోర్నీ మోర్కెల్ (309), జాక్వస్ కల్లీస్ (291), వెర్నన్ ఫిలాండర్ (224) రబడా కన్నా ముందున్నారు.
ఫస్ట్ టెస్ట్‌లో ఆతిథ్య పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 88 పరుగుల లక్ష్యాన్ని 22.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అజర్ అలీ (31), బాబర్ ఆజమ్ (30) పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 220 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ 378 రన్స్ చేసింది. ప్రొటీస్ ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌట్ అయింది పాక్ 90 రన్స్ చేసి విజయాన్ని అందుకుంది. సెంచరీ చేసిన ఫవాద్ ఆలంకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.