న్యూఢిల్లీ: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లండ్ వాళ్లను ఎక్కడా వదలట్లేదని అటు మైదానంలో, ఇటు మీడియా సమావేశంలో నోరు మెదపనీయడం లేదని మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ సరదాగా ట్వీట్ చేశాడు. అహ్మదాబాద్‌లోని మొతేరా వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీసేన సిరీస్‌లో 2-1తేడాతో ఆధిక్యం సాధించింది. ఈ నేపథ్యంలోనే మొతేరా పిచ్‌పై పలువురు మాజీ ఆటగాళ్లతో పాటు ఇంగ్లండ్ మీడియా విమర్శలు గుప్పించింది.
.@ashwinravi99 taking English wickets both on and off the field😆 #INDvsENG https://t.co/BAXhZ1Wxyg
— Wasim Jaffer (@WasimJaffer14) February 27, 2021
ఈ క్రమంలోనే శనివారం మీడియా సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఓ బ్రిటిష్ జర్నలిస్టు.. అశ్విన్‌ను ఆ పిచ్ గురించి మాట్లాడి కోపం తెప్పించాడు. మూడో టెస్టుకు తయారు చేసిన వికెట్ మంచిదేనా? అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన టీమిండియా స్పిన్నర్.. అసలు మంచి పిచ్ అంటే ఏమిటి? అని నిలదీశాడు. 'బ్యాట్‌కు, బంతికి మధ్య సమంగా పోరాటం జరగాలని అంతా అంటారు కానీ అసలు మంచి పిచ్ అంటే ఏమిటి? ఆటలో బౌలర్లు వికెట్ తీయాలనుకుంటే బ్యాట్స్‌మెన్ పరుగులు తీసేందుకు ప్రయత్నించడం సహజం. మంచి పిచ్ అంటే ఏమిటో ఎవరు వివరిస్తారు. ఆరంభంలో పేస్‌కు అనుకూలించి ఆపై బ్యాటింగ్‌కు, చివరి రోజుల్లో స్పిన్‌కు అనుకూలించాలా? అసలు ఎవరు ఈ నిబంధనలు రూపొందించారు.
ప్రతీ ఒక్కరికి తమ అభిప్రాయం ఉండవచ్చు కానీ దానిని ఇతరులపై రుద్దితే ఎలా? పిచ్‌లపై చర్చ చేయి దాటిపోతోంది. దీనిని ఆపి తీరాలి. మేం మరో దేశంలో ఆడినప్పుడో, మరో పిచ్ గురించి ఇంత చర్చ జరిగిందా? న్యూజిలాండ్‌తో మేం ఆడిన రెండు టెస్టులు కలిపి ఐదు రోజుల్లో ముగిసిపోయాయి. ఎవరైనా మాట్లాడారా? అయితే ఇలాంటి ఆలోచనాధోరణి నన్ను ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే దశాబ్దకాలంగా ఇది జరుగుతూనే ఉంది' అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కాగా, ఈ వీడియోను ట్విటర్లో పోస్టు చేసిన వసీమ్.. అశ్విన్ ఇంగ్లాండ్ వికెట్లను ఎక్కడా వదలట్లేదని సరదాగా ట్రోల్ చేశాడు.