India vs England: జాఫర్ అదిరే పంచ్.. టీమిండియా విజయాన్ని ఎగతాళి చేసిన పీటర్సన్‌కు మైండ్‌బ్లాక్!!

చెన్నై: విజయం కోసం ఇరు జట్ల ఆటగాళ్లు హోరాహోరీగా పోటీపడటం సహజమే. కానీ సోషల్ మీడియా వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆటగాళ్లతో పాటు మాజీలూ కూడా విజయం కోసం తలపడుతున్నారు. తమ జట్టుకు మద్దుతుగా నిలుస్తూ, క్రికెట్ అభిమానులకు ఉత్తేజాన్ని కలిగిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోటీపడుతున్నారు. వీరేంద్ర సెహ్వాగ్, వసీమ్ జాఫర్, కెవిన్ పీటర్సన్, మైకేల్ వాన్, మిచెల్ క్లార్క్, రికీ పాంటింగ్ లాంటి మాజీలు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. ఆటగాళ్లపై, జట్టుపై సెటైర్లు వేస్తుంటారు.

ఎగతాళి చేసిన పీటర్సన్:
తాజాగా కెవిన్ పీటర్సన్, వసీమ్ జాఫర్ మధ్య జరిగిన ట్విటర్ పోరు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ అద్భుత విజయాన్నందుకుంది. అయితే ఈ విజయాన్ని ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే పిచ్‌ను నిందిస్తూ భారత ఆటగాళ్ల ప్రదర్శనను తక్కువ చేసి మాట్లాడిన ఇంగ్లీష్ మాజీ ఆటగాళ్లు.. మ్యాచ్ అనంతరం కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. పీటర్సన్ టీమిండియా అభిమానులను కవ్విస్తూ ఓ ట్వీట్ చేశాడు. 'భారత్‌కు శుభాకాంక్షలు. ఇంగ్లండ్-బి జట్టును ఓడించినందుకు' అని ట్వీటాడు.

జాఫర్ అదిరే పంచ్:
కెవిన్ పీటర్సన్ ట్వీట్‌పై వసీమ్ జాఫర్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. 'కెవిన్ పీటర్సన్‌ను అసలు ట్రోల్ చేయకండి. కేపీ సరదాగా ఇలా చేస్తున్నాడు. అయితే నాకో విషయం అర్థమైంది. దక్షిణాఫ్రికా వాళ్లు లేకుండా ఇంగ్లండ్ ఎలా పూర్తి సామర్థ్యం కలిగిన జట్టు అవుతుంది?' అని జాఫర్ ట్వీట్ చేశాడు. దక్షిణాఫ్రికా చెందిన పీటర్సన్ ఇంగ్లండ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. జాఫర్ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. 'పీటర్సన్‌కు మైండ్‌బ్లాక్ అయ్యేలా పంచ్ ఇచ్చావ్' అని నెటిజన్లు జాఫర్‌ను కొనియాడుతూ కామెంట్లు చేస్తున్నారు.

ఆర్చర్, అండర్సన్, బట్లర్ దూరం:
రెండో టెస్ట్‌కు గాయంతో జోఫ్రా ఆర్చర్ దూరం కాగా.. రొటేషన్ పాలసీలో భాగంగా జేమ్స్ అండర్సన్, జోస్ బట్లర్‌కు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. అయినా ఇంగ్లీష్ జట్టు పటిష్టంగానే ఉంది. 482 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ మంగళవారం రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌటైంది. మొయిన్ అలీ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్. లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ అరంగేట్రంలోనే ఐదు వికెట్లతో సత్తాచాటగా.. అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ భారీ సెంచరీతో భారత్ 329 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 134 పరుగులకే కుప్పకూలింది.
డే అండ్ నైట్ కోసం రెడీ:
ఏడాది విరామం అనంతరం ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు మైదానానికి వచ్చిన అభిమానులకు భారత జట్టు చక్కటి బహుమతినిచ్చింది. కఠినమైన పిచ్‌పై బ్యాట్స్‌మన్ పోరాటానికి.. బౌలర్ల సహకారం తోడవడంతో కోహ్లీసేన సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. ఇక అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న మూడో టెస్టు (డే అండ్ నైట్) కోసం రెడీ అవుతున్నది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications