
కరాచి: కుటుంబ వారసత్వంగా లభించిన గడియారంను పాకిస్థాన్ బౌలింగ్ లెజెండ్, మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ విమానంలో పోగొట్టుకున్నారు. దీంతో ఎయిర్‌లైన్ సంస్థ వినియోగదారుల సేవలపై బుధవారం ట్విట్టర్ వేదికగా అక్రమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానంలో నా వాచ్ పోయింది. అది నాకు వారసత్వంగా లభించిన గడియారం. ఎవరన్నా త్వరగా నన్ను సంప్రదించండి అని అక్రమ్ అంటున్నారు.
'సీటు నంబర్ 10ఎ కేహెచ్‌ఐ-డీఎక్స్‌బీ, ఈకే 605 విమానంలో నా వాచ్ పోయింది. ఎవరన్నా త్వరగా నన్ను సంప్రదించండి. దుబాయ్‌లోని ఎయిర్‌లైన్ సంస్థకు చెందిన అన్ని వినియోగదారుల సేవా కేంద్రాలను సంప్రదించాను. వారి సేవల పట్ల అసంతృప్తిగా ఉన్నా. అది నాకు వారసత్వంగా లభించిన గడియారం' అని అక్రమ్ ట్వీట్ చేశారు. ఎమిరేట్స్ ట్విటర్‌ను ట్యాగ్ చేశారు.
వసీమ్ అక్రమ్ ట్వీట్‌కు 'ఎమిరేట్స్ సపోర్ట్' స్పందించింది. 'హాయ్ వసీమ్ అక్రమ్. మీ ప్రయాణించిన విమానం వివరాలు, ఈమెయిల్ వివరాలతో పాటు గడియారం గురించి మరిన్ని వివరాలు తెలపండి. మా సిబ్బందికి ఆ వివరాలు అందజేస్తాం. త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తాం. ధన్యవాదాలు' అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వసీమ్‌ను కొందరూ ఓ ఆటాడుకుంటున్నారు.
'వారసత్వంగా లభించిన వాచ్ కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది' అని ఒకరు ట్వీట్ చేశారు. 'వసీమ్ అది కేవలం వస్తువు మాత్రమే. మరణించినప్పుడు ఇవేవీ మన వెంట రావు. చేసిన మంచే వస్తుంది. ముందు సేవ చేయండి' అని మరొకరు ట్వీట్ చేశారు. గతంలోనూ మాంచెస్టర్ విమానాశ్రయ సిబ్బందిపై వసీమ్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. విమానాశ్రయ సిబ్బంది బహిరంగంగా చెక్ చేశారు. ఇన్సూలిన్‌ను కోల్డ్‌కేస్‌లోంచి తీసి ప్లాస్టిక్ సంచీలోకి వేయడంతో వసీమ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
53 ఏళ్ల వసీమ్ అక్రమ్ 1984లో వన్డేల్లో పాకిస్థాన్ తరఫున ఆరంగేట్రం చేశారు. ఇక 1985లో టెస్టుల్లో ఆడారు. 2003లో చివరి వన్డే మ్యాచ్ ఆడారు. పాకిస్థాన్ తరఫున అక్రమ్ 104 టెస్టులు ఆడి 414 వికెట్లు తీసాడు. ఇందులో 5 వికెట్ల ప్రదర్శన 25 సార్లు ఉంది. 356 వన్డేలలో 502 వికెట్లు సాధించారు. 5 వికెట్ల ప్రదర్శన 6 సార్లు ఉంది.