హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెట్‌కి మళ్లీ మంచి రోజులొస్తున్నాయని ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. నవంబర్‌లో వెస్టిండిస్ జట్టు పాకిస్థాన్‌లో టీ20 సిరిస్ ఆడేందుకు అంగీకరించింది. ఈ మేరకు వెస్టిండిస్ పర్యటనకు సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సోమవారం అధికారిక ప్రకటన చేసింది.
మరోవైపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో శ్రీలంక టీ20 సిరిస్ ఆడేందుకు ఇటీవలే అంగీకరించిన సంగతి తెలిసిందే. దీనిపై వసీం అక్రమ్ స్పందించాడు. 'నేను పాకిస్థాన్ ఉజ్వల క్రికెట్‌ని చూస్తూ పెరిగాను. ఈ తరం వాళ్లకి మళ్లీ ఆ అదృష్టం లభిస్తోంది' అని అక్రమ్ ట్వీట్ చేశాడు.
2009లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై టెర్రరిస్ట్‌లు ఉగ్రదాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో ఆరుగురు పాకిస్థాన్ పోలీసులతో పాటు శ్రీలంకకు చెందిన పలువురు క్రికెటర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి ఘటన అనంతరం అంతర్జాతీయ టెస్టు హోదా కలిగిన ఏ జట్టు క్రికెట్ జట్టు కూడా పాక్‌లో పర్యటించేందుకు సాహసించలేదు.
ఇదిలా ఉంటే అంతర్జాతీయ ఆటగాళ్లతో కూడిన వరల్డ్ ఎలెవన్ జట్టు త్వరలో పాకిస్థాన్‌లో పర్యటించనుంది. 'వరల్డ్ ఎలెవన్ జట్టు త్వరలో లాహోర్‌లో పర్యటించనుంది. ఆ తర్వాత శ్రీలంక జట్టు పాకిస్థాన్ పర్యటనకు వస్తుంది. ఆ తర్వాత మిగతా జట్లకు కూడా పాక్ డోర్స్ తెరిచే ఉంటాయి' అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజీమ్ సేథీ వెల్లడించాడు.

లాహోర్ పర్యటనకు వచ్చే వరల్డ్ ఎలెవన్ జట్టుకి ప్రెసిడెన్షియల్ లెవెల్ భద్రతను కల్పించేందుకు పాక్ ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ని ఓడించి పాకిస్థాన్ తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ టోర్నీ అనంతరం ఒక్క భారత్ మినహా అన్ని దేశాలు పాక్‌లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నాయని సేథీ పేర్కొన్నాడు. ఆండీ ప్లవర్ కోచ్‌గా ఉన్న వరల్డ్ ఎలెవన్ జట్టులో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు హషీం ఆమ్లా, ఫా డుప్లెసిస్, మోర్నీ మోర్కెల్, ఇమ్రాన్ తాహిర్‌లు ఉన్నారు.