
ఎం సుందర్ కఠిన నిర్ణయం:
వాషింగ్టన్ సుందర్ తండ్రి ఎం సుందర్ చెన్నై ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో పనిచేస్తారు. ఉద్యోగ రీత్యా వారంలో రెండుమూడు సార్లు బయటకు వెళ్లక తప్పదు. ఈ నేపథ్యంలో తన ద్వారా కుమారుడు వాషింగ్టన్‌కు కరోనా వైరస్ రాకూడదని ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ 2021 నుంచి సుందర్ తిరిగొచ్చినప్పటి నుంచి తల్లి, సోదరితో కలిసి తన ఇంట్లో ఉంటున్నాడు. అతడి తండ్రి మాత్రం మరో ఇంట్లో ఉంటున్నారు. అక్కడినుంచే ఆయన కార్యాలయంకు వెళ్లివస్తున్నారు. ఇక వీడియో కాల్స్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు.

నా ద్వారా కరోనా రాకూడదనుకున్నా:
తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో ఎం సుందర్ మాట్లాడుతూ... 'వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ 2021 నుంచి తిరిగొచ్చినప్పటి నుంచి నేను మరో ఇంట్లో ఉంటున్నాను. నా భార్య, కుమార్తె మాత్రం అతడితోనే మా ఇంట్లో ఉంటున్నారు. ఎందుకంటే.. వారు ఇంట్లోంచి బయటకు రారు. నేను వీడియో కాల్స్ ద్వారా వారితో మాట్లాడుతున్నాను. ఉద్యోగ రీత్యా వారంలో కొన్ని రోజులు నేను కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే సుందర్‌కు నా ద్వారా కరోనా రాకూడదనుకున్నా. అందుకే వేరే ఇంట్లో ఉంటున్నా. లార్డ్స్ సహా ఇంగ్లండ్ మైదానాల్లో ఆడాలన్నది నా కొడుకు కోరిక. అందుకోసం ఏదైనా చేస్తా' అని తెలిపారు.

వైరస్ సోకితే విమానం ఎక్కే అవకాశం లేదు:
2018లోనే వాషింగ్టన్ సుందర్ ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఒక్క మ్యాచులోనూ అతడికి అవకాశం రాలేదు. లార్డ్స్ సహా ఇంగ్లండ్ మైదానాల్లో ఆడాలన్నది సుందర్ కోరికల్లో ఒకటి. ముంబైకి చేరుకొనేలోపు కరోనా వైరస్ సోకితే విమానం ఎక్కే అవకాశం లేదని బీసీసీఐ స్పష్టం చేయడంతో ఆటగాళ్లు మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సుందర్ బ్యాటు, బంతితో రాణించాడు. అప్పట్నుంచి అతడు జట్టులో కీలక సభ్యుడు అయ్యాడు. దాంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్స్, ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీసుకు ఎంపిక చేశారు.

అరంగేట్ర మ్యాచ్‌తోనే పెద్ద హీరో:
ఆసీస్ పర్యటనలో భాగంగా గబ్బా టెస్ట్ ద్వారా వాషింగ్టన్ సుందర్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసిన సుందర్.. శార్దుల్‌తో కలిసి ఆరో వికెట్‌కు 123 పరుగులు జోడించాడు. భారత్ స్కోరు 186/6గా ఉన్న దశలో వచ్చిన ఈ భాగస్వామ్యం చివర్లో కీలకంగా మారి జట్టు గెలుపునకు కారణమైంది. వాషింగ్టన్ తన తొలి మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడమే కాకుండా.. తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 62, రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేశాడు. అరంగేట్ర మ్యాచ్‌తోనే అతడు పెద్ద హీరో అయిపోయాడు.


Click it and Unblock the Notifications












