యాదవ్ కమ్యూనిటీ వల్లే సూర్యకుమార్‌కు అన్యాయం?
టీమిండియా మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ అశుతోష్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. వారణాసిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. ఆయనను అకస్మాత్తుగా కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఈ నిర్ణయం వెనుక ఎలాంటి క్రీడాపరమైన కారణాలు లేవని, కేవలం సామాజిక, రాజకీయ కారణాలే ఉన్నాయని ఆయన ఆరోపించారు. యాదవ్ కమ్యూనిటీకి చెందిన వాడు కాబట్టే తొలగించినట్లు అనిపిస్తోందని ఆయన ఆరోపించారు.
అశుతోష్ సిన్హా ఈ వివాదాన్ని సమాజ్ వాదీ పార్టీ ప్రచార అస్త్రమైన 'PDA' (వెనుకబడిన, దళిత, మైనారిటీ) రాజకీయాలతో ముడిపెట్టారు. సూర్యకుమార్ యాదవ్ ఓబీసీ (యాదవ్) వర్గానికి చెందినవాడు కావడం వల్లే ఆయనపై ఈ వివక్ష జరిగిందని ఆరోపించారు. అంతేకాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు, బీసీసీఐ కీలక ప్రతినిధి అయిన జై షా కనుసన్నల్లోనే ఈ కెప్టెన్సీ మార్పు జరిగిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్భుతంగా రాణిస్తున్న కెప్టెన్‌ను మార్చడం వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు ఉందన్నారు.

ఈ క్రికెట్ వివాదంతో పాటు బీజేపీ ప్రభుత్వంపై రిజర్వేషన్ల విషయంలో కూడా అశుతోష్ సిన్హా విరుచుకుపడ్డారు. బీజేపీ రిజర్వేషన్ల వ్యవస్థను దెబ్బతీస్తోందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ యువతకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన 69 వేల ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ, వనరక్షక్ (ఫారెస్ట్ గార్డ్) పోస్టుల భర్తీలో రిజర్వ్‌డ్ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, అభ్యర్థులు ఇప్పటికీ దీనిపై పోరాడుతున్నారని ఆయన గుర్తుచేశారు.
భారత రాజ్యాంగం అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తుంటే.. ప్రస్తుత బీజేపీ పాలనలో మాత్రం సామాజిక న్యాయం కనుమరుగవుతోందని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ అశుతోష్ సిన్హా ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో యూపీలో సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరిగిన రిజర్వేషన్ల కుంభకోణాలు, అక్రమాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. వెనుకబడిన వర్గాల హక్కులను కాలరాసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, సామాజిక న్యాయం కోసం తమ పార్టీ 'PDA' నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications