ప్రత్యేకం: గాలే టెస్టు అశ్విన్ కెరీర్‌లో ఓ మైలురాయి
హైదరాబాద్: గాలే వేదికగా శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టు టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెరీర్‌లో ఓ మైలురాయి. అశ్విన్‌కు ఇది 50వ టెస్టు కావడం విశేషం. రెండు సంవత్సరాల క్రితం శ్రీలంక పర్యటనకు టీమిండియా వెళ్లింది. అప్పుడు కూడా ఇదే గాలేలో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరిగింది.
గాలేలో శ్రీలంకతో తొలి టెస్టు ఆడే ముందు అశ్విన్ వేరు... ఆ తర్వాత అశ్విన్ వేరు. అప్పటి వరకు ఆడిన 25 టెస్టుల్లో అతను 98 వికెట్లు మాత్రమే తీశాడు. భారత్ ఆడిన గత 13 టెస్టుల్లో అశ్విన్‌ని 7 మ్యాచ్‌లలో పక్కన పెట్టారు. అయితే రెండేళ్ల క్రితం గాలే టెస్టు అశ్విన్ తల రాతను మార్చింది. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆరు వికెట్లు సహా మొత్తం అతను 10 వికెట్లు తీశాడు.
అంతే అశ్విన్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత అతడు ఆడిన 24 టెస్టుల్లో ఏకంగా 151 వికెట్లు తీశాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అశ్విన్ ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నాడు. బుధవారం తన 50వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న అశ్విన్ పాత జ్ఞాపకాలను పంచుకున్నాడు.

ఆనాడు గాలే టెస్టు ఇచ్చింది
‘టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకునే అవకాశాన్ని నాకు ఆనాడు గాలే టెస్టు ఇచ్చింది. ఇప్పుడు రెండేళ్ల తర్వాత మళ్లీ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన రోజుల నుంచి చూస్తే 50 టెస్టు మ్యాచ్‌లు ఆడే అవకాశం రావడం నిజంగా గర్వకారణంగా భావిస్తున్నా. ఇకపై ఎన్ని మ్యాచ్‌లు ఆడినా అదంతా అదనంగా లభించే ఆనందమే' అని అశ్విన్ తెలిపాడు.
అనుభవాలు పాఠాలు నేర్పుతాయన్న అశ్విన్
మంచి రోజులు, చెడ్డ రోజులు క్రికెటర్ జీవితంలో భాగమని, అనుభవాలు పాఠాలు నేర్పుతాయన్న అశ్విన్... 2015తో పోలిస్తే ఆటగాడిగా తాను ఎంతో మెరుగయ్యానని చెప్పాడు. 'గతంలో నేను లక్ష్యాలు పెట్టుకుని ఉండొచ్చు. కానీ ఇక ముందు పెట్టుకోను. గతం నాకు నేర్పించింది అదే. అంతర్జాతీయ క్రికెటర్‌గా ప్రతిరోజూ మెరుగుపడడం అనేది కఠినమే కావొచ్చు. కానీ గత ఘనతలను గుర్తు చేసుకుంటూ కూర్చుంటే ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఎప్పుడైనా సరే.. అప్పుడు జరుగుతున్న మ్యాచ్ గురించే ఆలోచించాలి. ఆ రోజు ఆటపైనే దృష్టిపెట్టాలి' అని అశ్విన్ అన్నాడు.

49 టెస్టుల్లో 25.22 సగటుతో 275 వికెట్లు
అశ్విన్ ఇప్పటివరకు 49 టెస్టుల్లో 25.22 సగటుతో 275 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు 25 సార్లు తీయగా... మ్యాచ్‌లో 10 వికెట్లు 7 సార్లు తీశాడు. 50వ టెస్టు ఆడుతుండడం మంచి భావనే కలిగిస్తున్నా, కెరీర్‌లో ఇంకెన్ని టెస్టులు ఆడతానో చెప్పలేనని అన్నాడు. భారత జట్టులో తీవ్రమైన పోటీ మధ్య చోటు నిలబెట్టుకోవడమే గొప్ప ఘనతగా అతను అభివర్ణించాడు.

ఆ ఆనంద క్షణాలు గుర్తుకొస్తున్నాయి
శ్రీలంకలో మళ్లీ పర్యటిస్తుండటంపై అశ్విన్ మాట్లాడుతూ 'నేను బాగా రాణించిన చోటికి మళ్లీ రావడంతో కల నిజమైనట్లు అనిపిస్తోంది. ఇక్కడ ఓ మ్యాచ్‌లో నేను తొలి రోజే ఆరు వికెట్లు పడగొట్టాను. మూడో రోజు మ్యాచ్‌లో పది వికెట్ల ఘనత పూర్తి చేశా. ఆ ఆనంద క్షణాలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి' అని అశ్విన్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications