సచిన్‌ను మొదటిసారి చూసినప్పుడు: భువీ అనుభవం ఇదీ


హైదరాబాద్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ని మొట్టమొదటిసారి చూసినప్పుడు తాను ఏమీ మాట్లాడలేకపోయానని టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ వెల్లడించాడు. తాజాగా గౌరవ్ కపూర్ హోస్ట్‌గా వ్వవహారించిన 'బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' అనే కార్యక్రమంలో భువనేశ్వర్ కుమార్ పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా భారత జట్టులోని ఆటగాళ్లకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను భువీ పంచుకున్నాడు. భువీ మాట్లాడుతూ 'తొలిసారి సచిన్ టెండూల్కర్‌ను చూసినప్పుడు ఏమీ మాట్లాడలేకపోయా. దేశవాళీ మ్యాచ్ కోసం మైదానానికి వెళ్లేందుకు నేను గదిలో నుంచి బయటకు వచ్చాను. ఇంతలో ఎవరో వచ్చి గది తలుపు కొడుతూ ఉన్నారు' అని అన్నాడు.

ఎవరా? అని వెనక్కి తిరిగి చూస్తే సచిన్
'ఎవరా? అని వెనక్కి తిరిగి చూస్తే సచిన్. మొదటిసారి సచిన్‌ను చూడటం అప్పుడే. ఇద్దరం కలిసి లిఫ్ట్ ఎక్కి కిందకు వెళ్తున్నాం. ఆ సమయంలో నాకు ఏం మాట్లాడాలో పాలుపోలేదు. సచిన్ మాత్రం నన్ను విష్ చేశాడు. అప్పుడు జరిగిన మ్యాచ్‌లో నేను సచిన్‌ను డకౌట్ చేశాను' అని భువనేశ్వర్ చెప్పుకొచ్చాడు.

డ్రస్సెంగ్ రూమ్‌లో పెద్దగా ఏం మాట్లాడను
భారత జట్టులో చోటు దక్కించుకున్న కొత్తలో తాను డ్రస్సెంగ్ రూమ్‌లో పెద్దగా ఏం మాట్లాడేవాడిని కాదని, చాలా రిజర్వ్‌డ్‌గా ఉండేవాడినని తెలిపాడు. అంతేకాదు తాను ఏదైనా చెప్పాల్సి వస్తే ఇషాంత్ శర్మకు చెప్పేవాడినని భువనేశ్వర్ తెలిపాడు. ఇక, టీమిండియాలో ఎవరు ఎక్కువగా అబద్ధాలు చెబుతుంటారో మీకు తెలుసా? అన్న ప్రశ్నకు భువీ స్పందించాడు.

జడేజా ఎక్కువగా అబద్ధాలు చెబుతాడు
"భారత క్రికెటర్లలో ఎక్కువగా రవీంద్ర జడేజా అబద్ధాలు చెబుతూ ఉంటాడు. ఈ విషయం జట్టులోని సభ్యులందరికీ తెలుసు. జడేజాకు కోహ్లీ అంటే చాలా భయం. కోహ్లీ తన చుట్టుపక్కల ఉన్న సమయంలో జడేజా ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. చాలా తక్కువగా మాట్లాడతాడు. ఒకవేళ జడేజా అబద్ధం చెప్పినట్లు కోహ్లీకి తెలిస్తే బాగా ఆటపట్టిస్తాడు" అని అన్నాడు.

ధావన్‌కు ఏమి చెప్పినా గుర్తుండదు
"ఇక, శిఖర్ ధావన్‌కు ఏమి చెప్పినా గుర్తుండదు. ఒక్కోసారి జట్టు సభ్యుల పేర్లు కూడా మర్చిపోతుంటాడు. ఎంతలా అంటే అందరం కలిసి భోజనం చేసేందుకు డైనింగ్ టేబుల్‌పై కూర్చుంటే మరో ఎండ్‌లో ఉన్న ఆటగాడి పేరు గుర్తుండదు. అతడ్ని పిలిచేందుకు ఆలోచిస్తూ ఉంటాడు" అని భువనేశ్వర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications