హైదరాబాద్: చిట్టగాంగ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ధీటుగా బదులిస్తోంది. తొలి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైన ఆస్ట్రేలియా రెండో టెస్టులో నిలకడగా ఆడుతోంది. రెండో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.
ఓపెనర్ రెన్‌షా (4) రెండో ఓవర్లోనే వెనుదిరిగినప్పటికీ.. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (88 బ్యాటింగ్) బంగ్లా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (58)తో రెండో వికెట్‌కు 93 పరుగులు, హ్యాండ్స్‌కాంబ్ (69 బ్యాటింగ్)తో కలిసి మూడో వికెట్‌కు 127 పరుగులు జోడించాడు.
8 వికెట్లు చేతిలో ఉన్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా స్కోరుకి ఇంకా 80 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 253/6తో మంగళవారం ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ మరో 52 పరుగులు మాత్రమే జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది.
దీంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ 94 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు. ముష్ఫికర్ రహీమ్ (68) ముందు రోజు స్కోరుకు ఆరు పరుగులే జత చేయడం విశేషం.