లాహోర్: ప్రపంచ కప్ టీ20 టోర్నీలో పేలవ ప్రదర్శన ఫలితంగా పాకిస్థాన్ క్రికెట్లో పదవులు త్యాగాలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ కెప్టెన్సీ నుంచి షాహిద్ అఫ్రిది వైదొలిగిన 24 గంటల లోపే ఆ జట్టు చీఫ్ కోచ్ పదవికి వకార్ యూనిస్ రాజీనామా చేశాడు.
'పాక్ కోచ్ పదవి నుంచి భారంగా వైదొలుగుతున్నా. పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు గత రెండేళ్లుగా ఎనలేని సేవలందించాను. 2015 వన్డే ప్రపంచకప్ వైఫల్యం తర్వాత నేను చేసిన ప్రతిపాదనలేవీ బోర్డు పరిగణనలోకి తీసుకోలేదు. టీ20 ప్రపంచకప్‌లో పాక్ మరింత అధ్వాన్నంగా ఆడింది. ఈ నేపథ్యంలో కోచ్‌గా వైదొలగాలని నిర్ణయించుకున్నా'అని వకార్ చెప్పాడు.
పాకిస్థాన్ జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని తెలిపాడు. ఇటీవల పాకిస్థాన్ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ తనను క్షమించాలని వకార్ యూనిస్ క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే.

పాక్ జట్టు వైఫల్యాలకు ఏ ఒక్కరినీ బాధ్యులను చేయడం సరికాదని, ఇది అఫ్రిదీ గానీ, పిసిబి ఛైర్మన్ వైఫల్యం కాదని చెప్పాడు. తాను మారితేనే సమస్యలు తొలగిపోతాయనుకుంటే.. తాను ఇంటికి వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించాడు.
కాగా, పాకిస్థాన్ జట్టు వైఫల్య ప్రభావం సెలెక్షన్ కమిటీ మీద కూడా పడింది. టీ20 ప్రపంచకప్‌తో పాటు ఆసియాకప్‌లో వైఫల్యానికి బాధ్యుల్ని చేస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హరూన్ రషీద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీని రద్దు చేసింది.