Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ నుంచే చాలా, కుంబ్లే నేను ఒకేలా: దూకుడుపై కోహ్లీ

కోల్‌కతా: టీమిండియాను మరోసారి అగ్రస్థానంలో నిలబెట్టిన టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన రెండు టెస్టుల్లో విజయం సాధించి సిరీస్‌ను కైవలం చేసుకున్న టీమిండియా.. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి అగ్రభాగాన నిలిచిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలోనే కెప్టెన్ కోహ్లీ.. బీసీసీఐ టీవీతో బుధవారం మాట్లాడాడు. 'ఈ వయసుకి టెస్టు కెప్టెన్‌ అవుతానని.. అందులోనూ నెంబర్‌వన్‌ జట్టుకి నాయకత్వం వహిస్తానని అస్సలు ఊహించలేదు. అయితే కెప్టెన్‌గా జట్టులో నా పాత్ర చాలా చిన్నది. జట్టు యాజమాన్యం పాత్ర చాలా ఉంటుంది. ఫ్లెచర్‌ బృందం.. ఆ తర్వాత రవిశాస్త్రి, బంగర్‌, శ్రీధర్‌.. వీళ్లందరూ కలిసి నన్ను జట్టుకు నాయకత్వం వహించేలా సన్నద్ధం చేశారు. వీళ్లందరికీ నేను రుణపడి ఉంటాను' అని కోహ్లీ తెలిపాడు.

ధోనీ నుంచే నేర్చుకున్నా

అంతేగాక, 'కెప్టెన్ ధోనీ నాయకత్వంలో ఆడేటపుడు నేను నా బ్యాటింగ్‌ ప్రణాళికల గురించే ఆలోచించేవాడిని. మిగతా బ్యాట్స్‌మెన్‌, బౌలర్లతో మాట్లాడేవాడిని కానీ నిర్ణయాలేమీ తీసుకునేవాడిని కాదు. ఇదే అన్నిటికంటే పెద్ద విషయం. నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ధైర్యం ఉండాలి. ఈ విషయంలో ధోనీ నుంచి చాలా నేర్చుకున్నా. నిర్ణయం సరైందో కాదో.. మనకు మనం సర్దిచెప్పుకుని ముందుకెళ్లడం కెప్టెన్‌గా అత్యంత కీలకమైన విషయం. కెప్టెన్‌ అయ్యాక కొన్ని తప్పులు చేసినప్పటికీ వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతున్నా. నా ఎదుగుదలను లెక్కల్లో చెప్పలేను కానీ.. కాలంతో పాటు ఓ క్రికెటర్‌గా ఎదుగుతున్నా.' అని వెల్లడించాడు.

భారం కాదు.. గౌరవమే

'కెప్టెన్సీ అనగానే భారం లాగా భావించను. ప్రతికూలంగా చూడను. దీని వల్ల నాపై అదనపు ఒత్తిడేమీ లేదు. జట్టు కోసం మరింత బాధ్యత తీసుకోవడాన్ని ఇష్టపడతా. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తా. బాధ్యత మరింత పెరగడం వల్ల నా బ్యాటింగ్‌ ఇంకా మెరుగవుతుంది తప్ప దెబ్బ తినదు. జట్టు ఎదుర్కొనే ఒత్తిడిని ముందుండి నేను తీసుకోవడానికి ఎప్పుడూ సిద్ధం. మా జట్టుపై అనవసరంగా ఎవరు విమర్శలు చేసినా.. ప్రతికూల ప్రభావం పడేట్లున్నా దాన్ని నేను ముందు ఎదుర్కొంటా. కెప్టెన్‌గా అది నా కర్తవ్యం. కెప్టెన్‌గా నా ప్రయాణం విజయవంతంగా సాగుతుందని ఆశిస్తున్నా' అని పేర్కొన్నాడు.

అందరి ఆమోదం..

'కెప్టెన్‌గా నా తొలి టెస్టు అనుభవం ఇంకా గుర్తుంది. 2014 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అడిలైడ్‌ టెస్టులో నాకు బాధ్యతలు ఇచ్చారు. ఆ మ్యాచ్‌ సందర్భంగా సహచరులతో దూకుడుగా ఆడటం గురించి మాట్లాడా. నాలుగో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్నపుడే.. లక్ష్యం ఎంతైనా సరే, ఛేదించడానికే ప్రయత్నిద్దామని అన్నాను. ఈ క్రమంలో ఏం జరిగినా పర్వాలేదని చెప్పాను. నా అభిప్రాయంతో ఏకీభవిస్తారా? అని అడగా.. పది మందీ సరే అన్నారు. ఈ మ్యాచ్‌ ఓడినప్పటికీ.. సహచరులు చూపించిన నమ్మకం, ధైర్యం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఈ జట్టు సాహసాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని.. నాకప్పుడే అర్థమైంది' అని కోహ్లీ తెలిపాడు.

Want to get better & better: Virat Kohli

గెలిచి చూపించాం

'సొంతగడ్డపై విఫలమైతే చెత్త జట్టని ముద్రవేస్తారు. ఒకానొక సమయంలో విదేశాల్లో ఆడేంత సీన్‌ లేదనే కామెంట్లు కూడా వచ్చాయి. కానీ మేము సాధించి చూపించాం. ఆ తర్వాత స్పిన్‌ను ఎదుర్కోవడంలో తడబాటు ఎదురవడంతో మళ్లీ విమర్శలు...! ఒక క్రికెటర్‌గా లోపాలను గుర్తెరిగి వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. ప్రపంచంలో ఎక్కడైనా ఆడగలం.. ఎంతటి జట్టునైనా మట్టికరిపించగలం. ఇలాంటి దృక్పథాన్ని అలవర్చుకోవాలి. టీమిండియాను కూడా ఇలా మార్చడానికి కృషి చేస్తా. బౌలింగ్‌ విభాగం సరైన దిశలో నడుస్తోంది. శ్రీలంక టూర్‌ నుంచి జట్టు విజయంలో పేస్‌ విభాగం కీలకపాత్ర పోషిస్తోంది. స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించినా.. ప్రతికూల పరిస్థితుల్లో కూడా పేసర్లు సత్తాచాటారు' అని కోహ్లీ వివరించాడు.

కుంబ్లేతో చర్చలేం లేవు

'కుంబ్లే ఎంత గొప్ప ఆటగాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మా ఇద్దరి ఆలోచనలు చాలా త్వరగా కలిసిపోయాయి. కుంబ్లే కోచ్‌ కావడానికి ముందే ఒకసారి విమాన ప్రయాణంలో సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం. అప్పుడే మేమిద్దరం ఒకేలా ఆలోచిస్తామని అర్థమైంది. అందుకే కోచ్‌ అయ్యాక మా ఇద్దరి మధ్య పెద్ద చర్చలేమీ జరగలేదు. జట్టును ముందుకు తీసుకెళ్లడానికి నేనేం కోరుకుంటున్నానో అనిల్‌ భాయ్‌కి అర్థమైంది. కుంబ్లే వచ్చాక జట్టులో చాలా మార్పు వచ్చింది. అదనపు భరోసా వచ్చింది. ముఖ్యంగా బౌలర్లలో నమ్మకం పెరిగింది. కుంబ్లే అనుభవం అమూల్యం. అన్ని రకాల పరిస్థితులనూ ఎదుర్కొన్నవాడు కావడంతో మా పని తేలికవుతోంది' అని పేర్కొన్నాడు.

ప్రస్తుత జట్టులో ఉన్న చాలా మంది ఆటగాళ్లు రానున్న కాలంలో దిగ్గజ క్రికెటర్లుగా ఎదుగుతారని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. అందుకే ఈ జట్టుకు సారథ్యం వహించడాన్నే తాను పెద్ద ఘనతగా భావిస్తున్నట్లు తెలిపాడు. ముందు ముందు మరింత మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామని కోహ్లీ స్పష్టం చేశాడు. కాగా, మొత్తం 16 టెస్టులకు నాయకత్వం వహించిన కోహ్లీ.. 9విజయాలను నమోదు చేశాడు. వీటిలో మరో 2 ఓటములు, 5 డ్రాలు ఉన్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+