ముంబై: భారత క్రికెట్ జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి పైన చర్యలు తీసుకోవాలని వాంఖేడే పిచ్ క్యురేటర్ సుధీర్ నాయక్ బిసిసిఐకి లేఖ రాశారు. అతనిని సస్పెండ్ చేయాలని తన లేఖలో పేర్కొన్నారు. భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఐదో వన్డే అనంతరం తన పైన అనుచితంగా ప్రవర్తించారన్నారు.
క్యురేటర్ సుధీర్ నాయక్ రవిశాస్త్రితో పాటు కోచింగ్ స్టాఫ్ మెంబర్ భరత్ అరుణ్‌లు తనను అవమానించారని బిసిసిఐకి ఫిర్యాదు చేశారు. సహాయకుడిని దూషించేందుకు భరత్ అరుణ్ కుమార్ ఎవరని ప్రశ్నించారు.పిచ్ అంశాన్ని లేఖలో ప్రస్తావించారు.
సాధారణంగా టీమ్ మేనేజ్‌మెంట్ అడిగిన పిచ్ తయారు చేసేందుకు కనీసం పది నుంచి పన్నెండు రోజుల ముందు తెలియజేస్తారని, అయితే ముంబై వాంఖేడే పిచ్‌కు వచ్చేసరికి తమకు ఎటువంటి పిచ్ కావాలన్నది తెలియచేయలేదన్నారు.

మ్యాచ్ ఆరంభానికి రెండు రోజుల ముందే టర్నింగ్ వికెట్ కావాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరినట్లు పేర్కొన్నారు. దీంతో తాము తమ శాయశక్తులా ప్రయత్నించామన్నారు. నీటిని తొలగించడం, గడ్డిని రోలింగ్ చేశామన్నారు. తమకు అప్పగించిన పని సమర్థవంతంగా చేశామన్నారు.
మ్యాచ్‌కు ముందు రోజు గుడ్ లెంగ్త్ ప్రాంతంలో నీటిని చల్లమని మేనేజ్‌మెంట్ చెప్పినా రెండు వేర్వేరు పిచ్‌లు తయారు చేయడం మంచిది కాదనే సలహాతోనే దానిని పక్కకు పెట్టామని, దీనిపై బిసిసిఐ క్యురేటర్ ధీరజ్ ప్రసన్న స్పష్టం చేసిన మార్గదర్శకాలను కూడా పాటించామని లేఖలో వివరించారు. కాగా, ఐదో వన్డే అనంతరం రవిశాస్త్రి, పిచ్ క్యురేటర్ సుధీర్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.