16 నవంబర్, 2013.. భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని రోజు ఇది. 24 ఏళ్ల పాటు తన ఆటతీరుతో టీమిండియాను తన భుజాన్న మోసిన గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ తెందుల్కర్ ఆటకు వీడ్కోలు పలికిన రోజు ఇది. హోం గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో సొంత అభిమానుల మధ్య వెస్డిండీస్‌తో జరిగిన టెస్ట్‌తో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే ఆ రోజు జరిగిన ఓ సంఘటన తనను చాలా బాధపెట్టినట్లు తెలిపాడు సచిన్. తన ఎమోషన్స్ తో ఓ వ్యక్తి ఆడుకున్నాడని ఆరోపించాడు. వాంఖడే స్టేడియం 50 ఏళ్ల వార్షికోత్సవ సంబరాల ఈవెంట్ లో ఈ విషయాన్ని తెలిపాడు.
ఎప్పటికీ మర్చిపోలేను
కెరీర్ చివరి మ్యాచ్ ను తన తల్లి సమక్షంలో ఆడటం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పిన సచిన్.. ఆ అవకాశాన్ని కల్పించిన బీసీసీఐ ధన్యవాదాలు తెలిపాడు. "సిరీస్ గురించి ప్రకటించగానే, నేను బీసీసీఐని కలిసి ఓ రిక్వెస్ట్ చేశాను. నా లాస్ట్ మ్యాచ్ ను ముంబయిలో ఆడించాలని విజ్ఞప్తి చేశాను. ఎందుకంటే నేను 24 ఏళ్ల పాటు ఇండియా కోసం ఆడాను. మొత్తంగా 30 ఏళ్ల వరకు ఆడాను. కానీ మా అమ్మ నేను ఆడటం ఎప్పుడూ లైవ్ లో చూడలేదు. నా ఫేర్ వెల్ మ్యాచ్ సమయంలో మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు. ఎక్కడికీ ప్రయాణించే స్థితిలో లేదు. అదే వాంఖడే స్టేడియం అయితే మా అమ్మ రావడానికి వీలుగా ఉంటుంది. అందుకే వాంఖడేలో నా చివరి మ్యాచ్ ఆడతానని బీసీసీఐకి రిక్వెస్ట్ చేశాను. వాళ్లు దాన్ని అంగీకరించారు." అని సచిన్ పేర్కొన్నాడు.

నా ఎమోషనల్ తో ఆడుకున్నాడు
అయితే ఆ మ్యాచ్‌లో బ్రాడ్ కాస్ట్ ప్రొడ్యూసర్ తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడని గుర్తు చేసుకున్నాడు సచిన్. అతడు తన ఎమోషన్స్‌తో ఆడుకున్నాడని పేర్కొన్నాడు. "నా బ్యాటింగ్‌కు దిగిన సమయంలో వెస్టిండీస్ జట్టు నన్ను చాలా గౌరవించింది. స్టేడియంలోని ప్రేక్షకులు కూడా ఎంతో మంచిగా స్వాగతించారు. అప్పుడు నేను ఎమోషన్ కు గురయ్యాను. నా కళ్లలో నీరు తిరిగాయి. కానీ నేను ఆటపై ఫోకస్ చేయాలి. అప్పుడు లాస్ట్ ఓవర్ కు ముందు స్టేడియంలోని బిగ్ స్క్రీన్ ను చూశాను. అప్పుడు మా అమ్మతో పాటు నా భార్య , పిల్లల్ని బిగ్ స్క్రీన్‌లో చూపించారు. దీంతో నేను మరింత ఎక్కువ ఎమోషన్ అయ్యాను. బ్రాడ్ కాస్ట్ చేసిన ప్రొడ్యూసర్ వెస్టిండీస్ కు సపోర్ట్ గా అలా చేశాడేమో అనిపించింది. అతడు నా ఎమోషన్స్ తో ఆడుకున్నాడు.బహుశా అతడికి విండీస్ పాస్‌పోర్ట్ ఇచ్చిందేమే?" అని సచిన్ నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నాడు.