టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'రోహిత్.. నువ్వు సూపర్' అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
ఎందుకంటే?
వారం రోజులుగా ఘనంగా నిర్వహిస్తోన్న వాంఖడే స్టేడియం 50 ఏళ్ల వార్షికోత్సవ సంబరాలు ముగిశాయి. సంబరాలకు ముగింపు పలుకుతూ చివరి రోజు జరిగిన కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజాలు సునీల్ గావస్కర్, సచిన్ తెందూల్కర్ తో పాటు రవిశాస్త్రి, డయానా ఎడుల్జీ తదితరులు పాల్గొన్నారు. 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను కూడా విడుదల చేశారు. అయితే ఈ ప్రత్యేక కార్యక్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే సీనియర్ క్రికెటర్ తో కెప్టెన్ రోహిత్ వ్యవహరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.

రోహిత్ ఏం చేశాడంటే?
సభా వేదికపై మాజీ క్రికెటర్ల కోసం కుర్చీలను కాస్త దూరంగా మూడు వైపులా వేశారు. అయితే రోహిత్ శర్మ వేదిక దగ్గరకు వచ్చే సమయానికి సచిన్, గావస్కర్, ఎడుల్జీ, రవిశాస్త్రి కూర్చొని ఉన్నారు. అప్పుడు రవిశాస్త్రి తన పక్కనే ఉన్న సీటును చూపిస్తూ.. అందులో కూర్చోవాలని సూచించాడు. కానీ అప్పటికే సభ మధ్యలో ఓ రెండు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. దీంతో అక్కడ కూర్చోవాలని రవిశాస్త్రిని రోహిత్ కోరాడు. అలా మాజీ క్రికెటర్ అయిన రవిశాస్త్రిని గౌరవిస్తూ మధ్యలో కూర్చోబెట్టి ఆ పక్కన రోహిత్ కూర్చొన్నాడు. ఇప్పుడు ఈ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాజీ క్రికెటర్లకు రోహిత్ ఎలా గౌరవిస్తాడో, ఎంత వినయంగా ఉంటాడో చెప్పడానికి ఇదే నిదర్శనం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మళ్లీ ట్రోఫీని తీసుకొస్తా
ఇకపోతే టీ20 ప్రపంచ కప్‌ను టీమిండియా విజయం సాధించిన తర్వాత, ఆ ట్రోఫీని వాంఖడే మైదానానికి తీసుకొచ్చి సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించి, ట్రోఫీని వాంఖడేకు తీసుకొస్తామని మాటిచ్చాడు రోహిత్. మరోసారి 140 కోట్ల మంది ఆశలను దుబాయ్‌కు తీసుకెళ్తోన్నట్లు పేర్కొన్నాడు.