మరికొన్ని రోజుల్లో భారత్‌తో సిరీస్ ప్రారంభం కానున్న వేళ శ్రీలంక టీ20 కెప్టెన్ వానిందు హసరంగ సారథి బాధ్యతలకు గుడ్‌బై చెప్పాడు. టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంక పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అయితే ఆటగాడిగా జట్టులోనే కొనసాగుతానని, శ్రీలంక విజయం కోసం పోరాడతానని తెలిపాడు.
టీ20 వరల్డ్ కప్-2024లో శ్రీలంక గ్రూప్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. సూపర్-8కు కూడా అర్హత సాధించలేకపోయింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధించి, మిగిలిన రెండింట్లో ఓటమిపాలైంది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. గ్రూప్-డీలో శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ జట్లు ఉన్నాయి. నెదర్లాండ్స్‌పై మాత్రమే లంక గెలిచింది.

ఆరు నెలల క్రితమే హసరంగ టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. దీంతో ప్రజలు, బోర్డు నుంచి కూడా అతనిపై తీవ్ర ఒత్తిడి రాలేదు. కానీ హసరంగ సారథిగా తప్పుకున్నాడు. ''ఆదిలోనే టీ20 వరల్డ్ కప్ నుంచి శ్రీలంక నిష్క్రమించడం కెప్టెన్‌గా నన్ను, జట్టును తీవ్రంగా కలచివేసింది. ఓ జట్టుగా, ఓ దేశంగా మాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. టోర్నీకి అత్యుత్తమ జట్టే ఎంపికైందని నా నమ్మకం. అయితే మా పేలవ ప్రదర్శనకు సాకులు చెప్పాలనుకోవట్లేదు''
''బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విజయానికి దగ్గర వరకు వచ్చాం. ఆ పోరులో గెలిచితీరాల్సింది. అలా జరిగి ఉంటే శ్రీలంక పరిస్థితులు, అదృష్టాలు భిన్నంగా ఉండేవి'' అని హసరంగ పేర్కొన్నాడు. హసరంగ సారథ్యంలో శ్రీలంక 10 టీ20లు ఆడింది. ఆరు మ్యాచ్‌లు గెలిచింది. జింబాబ్వే, అఫ్గానిస్థాన్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లు విజయం సాధించింది.
హసరంగ ఈ ఏడాదిలో రెండు మ్యాచ్‌ల సస్పెండ్‌కు గురయ్యాడు. అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించినందుకు ఐసీసీ చర్యలు తీసుకుంది. అయితే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడాలనే ఉద్దేశంతో టెస్టు రిటైర్మెంట్‌ను హసరంగ వెనక్కి తీసుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో అతనిపై నిషేధం పడి, టీ20 వరల్డ్ కప్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ విషయంపై ఐసీసీని హసరంగ, శ్రీలంక బోర్డు బురిడీ కొట్టించిందని విమర్శలు కూడా వచ్చాయి. కాగా, శ్రీలంక టీ20 కెప్టెన్‌గా చరిత అసలంకను నియమించాలని శ్రీలంక క్రికెట్ బోర్డు భావిస్తోంది. లంక ప్రీమియర్ లీగ్‌లో అసలంక జఫ్నా కింగ్స్‌కు సారథిగా ఉన్నాడు.