విశాఖపట్నం: టీమిండియాకు చారిత్రాత్మక విజయాలను అందించిన విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి స్టేడియం మరో అరుదైన చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య చివరిదైన ఐదో వన్డే విశాఖపట్నంలో జరుగుతుంది.
ఈ వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు తమ అమ్మల పేర్లతో ముద్రించిన జర్సీలను ధరించారు. 'స్టార్ ప్లస్' టీవీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంయుక్తంగా చేపట్టిన ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా టీమిండియా ఆటగాళ్లు ఈ జెర్సీలను ధరించారు.

మ్యాచ్‌లో టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన తల్లి దేవిక పేరుని ముద్రించిన జెర్సీతో వచ్చారు. టాస్ అనంతరం ధోని మాట్లాడుతూ తాము ఈ స్థాయిలో ఉండడానికి తల్లుల పాత్ర ఎంతో ముఖ్యమని, వారి త్యాగాల గుర్తుచేసుకుంటూ తమ జర్సీలపై వారి పేర్లతో ఈ రోజు మ్యాచ్ ఆడతున్నామని పేర్కొన్నాడు.
దేశ ప్రజల కోసం ఎంతగానో పాటుపడుతున్న జవాన్లను స్వాతంత్య్ర (ఆగస్టు 15), గణతంత్ర దినోత్సవం(జనవరి 26)నాడు మాత్రమే కాకుండా ప్రతిరోజూ తలుచుకొని ప్రశంసించాలని పేర్కొన్నాడు. దేశాన్ని రక్షిస్తున్న జవాన్ల పట్ల కూడా ప్రజలే ఇదే విధంగా ఉండాలని ధోని తెలిపాడు.
'దేశభక్తి, సైనికుల గురించి తరచూ జనవరి 26న, ఆగస్టు 15న మాట్లాడతాం. వారిని ప్రతి రోజూ తలచుకొని ప్రశంసించడం చాలా ముఖ్యం. అలాగే అమ్మ కూడా ఎన్నో త్యాగాలు చేస్తుంది. అందుకే అమ్మను, సైన్యాన్నీ ఒకేలా కీర్తించాలని' ధోని అన్నాడు. జెర్సీల వెనక అమ్మ పేర్లు పెట్టడం ఓ గొప్ప ముందడుగని అన్నాడు.
మనమెప్పుడూ తండ్రిపేరు ఇంటిపేరుగా వాడతామని అలాగే అమ్మ చేసిన త్యాగాలు, చూపే ప్రేమనూ ప్రశంసించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నాడు. తానెప్పుడూ భావోద్వేగపరంగా అమ్మతో అనుసంధానమై ఉంటానని తెలిపాడు. చాలాసార్లు మనం అమ్మ సేవల్ని గుర్తించడం లేదని, దీనిని అందరం గుర్తుంచుకోవాలని అన్నాడు.
టీమిండియా ఆటగాళ్లు తీసుకొన్న ఈ చొవరకు ప్రతీ ఒక్కరిలో సంతోషం వ్యక్తమవుతోంది. భారత్-న్యూజిలాండ్ వన్డే సిరిస్‌కు ముందు ధోని, రహానే, కోహ్లీలు నటించిన యాడ్ 'స్టార్ ప్లస్' టీవీలో వచ్చింది.
"Nayi Soch" అనే టాగ్‌లైన్‌తో వచ్చిన వీడియోలో ఈ ముగ్గురూ తమ అమ్మల పేర్లతో ముద్రించిన జర్సీలను ధరించి కనిపించారు. మరోవైపు వన్డే సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే ఈ ఐదో వన్డేలో ఎలాగైనా గెలిచి దీపావళి బహుమతిని ఇవ్వాలనే పట్టుదలతో టీమిండియా ఉంది.