అవకాశాల కోసం ఎదురుచూపులు, మైండ్‌పై తీవ్ర ప్రభావం: హాఫ్ సెంచరీ తర్వాత పాండే

హైదరాబాద్: 'బ్యాటింగ్ అవకాశం కోసం ఎదురు చూడటం ఎంతో కష్టం, అది మీ మైండ్‌పై కూడా ప్రభావం చూపుతుంది' రెండో టీ20 అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మనీష్ పాండే చేసిన వ్యాఖ్యలివి. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో పాండే (79 నాటౌట్) రాణించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. మనీశ్ పాండే (79 నాటౌట్: 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు)తో కలిసి ధోని (52 నాటౌట్: 28 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్సులతో) ఐదో వికెట్‌కి అజేయంగా 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన దక్షిణాఫ్రికా 18.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులతో లక్ష్యాన్ని చేధించింది. మ్యాచ్ అనంతరం మనీశ్ పాండే మీడియాతో మాట్లాడుతూ 'నిజాయితీగా చెప్పాలంటే బ్యాటింగ్ అవకాశం కోసం ఎదురు చూడటం ఎంతో కష్టం, ముఖ్యంగా విదేశీ పర్యటనల్లో అది మీ మైండ్‌పై కూడా ప్రభావం చూపుతుంది' అని పాండే అన్నాడు.
భారత్ లాంటి జట్టులో అవకాశం ఎంతో కష్టం
'భారత్ లాంటి జట్టులో బ్యాటింగ్ అవకాశం స్టార్ క్రికెటర్లు.. లెజెండ్ తర్వాత లెజెండ్ ఆడిన తర్వాతే వస్తుంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో నెంబర్ స్థానంలో కూడా అవకాశం వచ్చింది. కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఐదో నెంబర్ స్థానంలో ఆడాల్సి వస్తుంది. ఐదో నెంబర్ స్థానంలో అద్భుత ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తున్నా' అని తెలిపాడు.

అత్యుత్తమ టాపార్డర్ భారత్ సొంతం
'అత్యుత్తమ బ్యాటింగ్ టాపార్డర్ కలిగిన జట్లలో భారత్ ఒకటి. కోహ్లీ లాంటి ఆటగాళ్లు 30-35 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తుంటారు. కొన్నిసార్లు బ్యాటింగ్ ఆర్డర్‌లో ధోని నాకంటే ముందుగా వస్తుంటాడు. ఇంకా కొన్ని అవకాశాలు వస్తే, ఇంకా మంచి ప్రదర్శన చేయగలుతా' అని అన్నాడు.

2009లో సెంచూరియన్‌లో పాండే సెంచరీ
దక్షిణాఫ్రికాతో ముగిసిన ఆరు వన్డేల సిరిస్‌లో పాండే బెంచికే పరిమితమయ్యాడు. కేదార్ జాదవ్ గాయపడటంతో అతడి స్థానంలో పాండేకు అవకాశం వస్తుందని భావించినప్పటికీ, జట్టు మేనేజ్‌మెంట్ శ్రేయాస్ అయ్యర్ వైపు మొగ్గు చూపింది. 'సెంచూరియన్‌లో ఆడేందుకు ఎంతగానో ఎదురుచూశా. వన్డేల్లో అయినా జట్టులో చోటు దక్కుకుందేమో అని చూశా. కానీ అది జరగలేదు. అయితే టీ20ల్లో రాణించడం... అది కూడా నాకు ఎంతో అచ్చొచ్చిన సెంచూరియన్‌లో సంతోషంగా ఉంది. 2009 ఐపీఎల్ సీజన్‌లో సెంచూరియన్ వేదికగానే తొలి సెంచరీ బాదిన సంగతి ఇంకా గుర్తుంది. మళ్లీ ఇదే వేదికపై హాఫ్ సెంచరీ చేయడం ఆనందంగా ఉంది' అని అన్నాడు.

ధోని హాఫ్ సెంచరీపై
ఇక, రెండో టీ20తో మళ్లీ ధోని ఫామ్‌లోకి రావడంపై కూడా పాండే స్పందించాడు. 'ధోని మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. సఫారీ బౌలర్లు మ్యాచ్‌లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో ధోని కూడా కొన్ని షాట్లు ఆడేందుకు తొలుత ఇబ్బందిపడ్డాడు. రెండు బంతులు అతని బ్యాట్ ఎడ్జ్‌ను తాకి వెళ్లినా.. అవి లక్కీగా బౌండరీ లైన్‌ని తాకాయి. అయితే.. చివరి ఐదు ఓవర్లలో మాత్రం ధోనీ అద్భుతమైన షాట్లు ఆడాడు. అతని దూకుడుతోనే భారత్ 188 పరుగులు చేయగలిగింది' అని పాండే పేర్కొన్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో నిర్ణయాత్మక మూడో టీ20 శనివారం కేప్ టౌన్ వేదికగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications