World Cup 2023: వరల్డ్ కప్‌లో పేలవ ప్రదర్శన తర్వాత పాకిస్తాన్ క్రికెట్‌లో సమూల మార్పులు చేపడుతున్న సంగతి తెలిసిందే. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో వరల్డ్ కప్‌ను ముగించిన పాకిస్తాన్ జట్టు.. స్వదేశానికి వచ్చీరాగానే ఆ టీం కెప్టెన్ బాబర్ ఆజమ్ తన కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. దాని కోసమే ఎదురు చూస్తున్నట్లుగా కొత్త కెప్టెన్లను పీసీబీ ప్రకటించింది.
వైట్‌బాల్ కెప్టెన్‌గా షహీన్ అఫ్రిదీని నియమించిన పీసీబీ.. టెస్టుల్లో షాన్ మసూద్‌కు బాధ్యతలు అప్పగించింది. ఇదే ఊపులో సెలెక్షన్ కమిటీ మొత్తాన్ని సస్పెండ్ చేసిన పాకిస్తాన్ క్రికెట్ పెద్దలు.. పురుషుల క్రికెట్ టీం డైరెక్టర్‌గా మాజీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్‌ను నియమించారు. ఇప్పుడు కొత్త చీఫ్ సెలెక్టర్‌ను కూడా సెలెక్ట్ చేశారు.

పాకిస్తాన్ మాజీ పేసర్ వాహబ్ రియాజ్‌ను టీం చీఫ్ సెలెక్టర్‌గా నియమిస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. రియాజ్ తన కెరీర్‌లో పాకిస్తాన్ తరఫున 154 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. తనకు ఇక పాకిస్తాన్ టీంలో అవకాశాలు రావని అర్థం చేసుకొని ఈ ఏడాది ఆగస్టులోనే రిటైర్‌మెంట్ ప్రకటించాడు.
కొన్ని రోజుల క్రితం వరకు ఈ స్థానంలో పాక్ మాజీ లెజెండ్ ఇంజమామ్ ఉల్ హక్ ఉండేవాడు. ఇప్పుడు అతని స్థానాన్ని రియాజ్ భర్తీ చేస్తాడు. తనకు ఈ అవకాశం దక్కడంపై సంతోషం వ్యక్తం చేసిన ఈ ఎడం చేతి వాటం పేసర్.. మాజీ క్రికెటర్లను ఇలాంటి కీలక పదవుల్లోకి తీసుకుంటున్న బోర్డు నిర్ణయాన్ని మెచ్చుకున్నాడు.
'క్రికెట్ విషయాల్లో మాజీ క్రికెటర్లను ఇన్‌వాల్వ్ చేయడం నిజంగా చాలా మంచి నిర్ణయం. పాకిస్తాన్ క్రికెట్‌ను మెరుగుపరచడంలో నా వంతు పాత్ర పోషించడానికి నేను సిద్ధంగా ఉన్నా' అని రియాజ్ తెలిపాడు. అదే సమయంలో సెలెక్షన్ కమిటీని ముందుండి నడిపించడం చాలా కష్టమైన పని అని చెప్పాడు.
'ఇది ఒక పెద్ద సవాల్. త్వరలోనే ఆసీస్‌తో సిరీస్ ఉంది. అది వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగం కూడా. అలాగే న్యూజిల్యాండ్‌తో టీ20ల సిరీస్ ఉంది. వచ్చే ఏడాది యూఎస్, వెస్టిండీస్ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం రెడీ అయ్యేందు ఈ కివీస్ టూర్ నుంచే బలమైన జట్టును తయారు చేయడం మొదలు పెట్టాలి' అన్నాడు.