

హైదరాబాద్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపై పలువురు క్రికెటర్లు సంతాపం తెలియజేశారు. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాజధాని చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం గం.6.10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.
కరుణానిధి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జూలై 26వ తేదీన ఆయన్ని కావేరీ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. కరుణ మృతి నేపథ్యంలో బుధ, శుక్రవారాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశారు.
కరుణానిధి పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం రాజాజీ హాలులో ఉంచనున్నారు. రేపు (బుధవారం) ఏడు గంటల వరకు సందర్శించవచ్చు. 1924, జూన్ 3న తంజావూరులోని తిరుక్కువలైలో జన్మించిన కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. ఆయన వయస్సు 94 ఏళ్లు. ఆయన పూర్వీకులు తెలుగువాళ్లు.
1957లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎంపికైన కరుణానిధి.. ఆ తర్వాత 2016 వరకు ఓటమి ఎరుగకుండా జైత్రయాత్రని కొనసాగించారు. 1949లో డీఎంకే పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో కరుణానిధి ఒకరు. అన్నాదురై మరణంతో 1969లో ఆయన తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు.
1957 నుంచి 13సార్లు తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికవుతూ వచ్చిన కరుణానిధి దాదాపు 50 ఏళ్లు డీఎంకే అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించి చరిత్ర సృష్టించారు. ఆయనకు ముగ్గురు భార్యలు, నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. ఆయన చిన్న కుమారుడు స్టాలిన్ ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
మంగళవారం కరుణానిధి మృతి పట్ల ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ క్రికెటర్లు ట్వీట్ చేశారు.