VVS Laxman: పరిస్థితులతో సంబంధం లేదు రెండో టెస్ట్‌కు అశ్విన్‌ను తీసుకోవాల్సిందే!

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగే రెండో టెస్ట్‌కు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని దిగ్గజ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. పరిస్థితులను పట్టించుకోకుండా అతనికి అవకాశమివ్వాలన్నాడు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన డబ్యూటీసీ ఫైనల్లో అశ్విన్‌ అద్భుత ప్రదర్శన చేసినా.. కౌంటీ క్రికెట్‌లో రాణించినా.. ఇంగ్లండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో అతనికి చోటు దక్కని విషయం తెలిసిందే.

పిచ్ పేసర్లకు సహకరిస్తుందని సంప్రదాయనికి (3+2) భిన్నంగా కోహ్లీసేన 4+1 ఫార్మాలాతో బరిలోకి దిగింది. దాంతో నాలుగో పేసర్‌గా అశ్విన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ వచ్చాడు. ఏకైక స్పిన్నర్‌గా బ్యాటింగ్ సామర్థ్యం ఉన్న రవీంద్ర జడేజా అవకాశం దక్కించుకున్నాడు.

సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లోనూ ఇదే 4+1 ఫార్ములాను కొనసాగిస్తామని మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ అన్నాడు. దాంతో రాబోయే టెస్టుల్లోనూ అశ్విన్‌ ఆడటం అనుమానంగా మారింది. అయితే వీవీఎస్ మాత్రం అతన్ని జట్టులోకి తీసుకోవాలంటున్నాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడుతూ.. అశ్విన్ జట్టులో చేర్చుకుంటే బౌలింగ్ డెప్త్ పెరుగుతుందన్నాడు.

'నేనైతే రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకునేవాడిని. అతని చేరికతో బౌలింగ్ డెప్త్ పెరగడమే కాకుండా బౌలింగ్‌లో వైవిధ్యం కూడా ఉంటుంది. పరిస్థితులు, వాతావరణం ఎలా ఉన్నా అశ్విన్‌ మేటి బౌలర్‌కు మించినవాడు. అద్భుతమైన ప్రదర్శన చేయడానికి తగిన వాడు. మ్యాచ్‌ విన్నర్‌గా నిలిచి ఇంగ్లండ్‌పై ఒత్తిడి తీసుకురాగల సమర్థుడు.'అని లక్ష్మణ్‌ కొనియాడాడు. ఇక తొలి టెస్టులో శార్ధూల్‌పై స్పందించిన వీవీఎస్‌.. 'కెప్టెన్‌ కోహ్లీ అతనికి మరిన్ని బాధ్యతలు అప్పగించి చూడాలనుకున్నాడు. శార్ధూల్‌ బ్యాట్‌తో రాణించకపోయినా బంతితో తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం తీసుకున్నాడు. పలు కీలక వికెట్లు తీశాడు. అశ్విన్, శార్దూల్ ఇద్దరూ సమర్థవంతులే. కానీ నాకు మాత్రం అశ్విన్‌ను తుదిజట్టులో చూడాలని ఉంది'అని వీవీఎస్‌ లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.

వర్షంతో డ్రాగా ముగిసిన తొలి టెస్ట్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జో రూట్‌ సేనను కోహ్లీసేన దెబ్బకొట్టింది. జస్ప్రీత్‌ బుమ్రా (4/46), మహ్మద్‌ షమి (3/28) చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఇంగ్లండ్ కుప్పకూలింది. అనంతరం కేఎల్‌ రాహుల్‌ (84), రవీంద్ర జడేజా (56) అద్భుత బ్యాటింగ్‌కు జస్‌ప్రీత్ బుమ్రా విలువైన పరుగులు జోడించడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 278 పరుగులు చేసి 95 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా (5/64) చెలరేగినప్పటికీ.. కెప్టెన్‌ జో రూట్‌ (172 బంతుల్లో 109; 14 ఫోర్లు) సెంచరీ‌తో ఇంగ్లండ్ 303 పరుగులు చేసింది. దాంతో భారత్ ముందు 209 పరుగుల సాధారణ లక్ష్యం నమోదైంది.

209 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత్‌ నాలుగో రోజు ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 52 పరుగులు చేసింది. ధాటిగా ఆడిన రాహుల్‌ (38 బంతుల్లో 26; 6 ఫోర్లు) నిష్క్రమించగా... రోహిత్‌ (12 బ్యాటింగ్‌), పుజారా (12 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. చేతిలో తొమ్మిది వికెట్లు.. విజయానికి కావాల్సింది 157 పరుగులు.. ఒక రోజు ఆట మిగిలి ఉండటంతో కోహ్లీసేన మ్యాచ్ గెలవడం పక్కా అని అంతా భావించారు. కానీ వరణుడు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇంగ్లండ్ 12వ ప్లేయర్‌గా భారత విజయాన్ని అడ్డుకొని అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, August 9, 2021, 18:42 [IST]
Other articles published on Aug 9, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X