న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్‌లపై దిగ్గజ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల జల్లు కురిపించాడు. శ్రేయస్ అయ్యర్‌ను స్టాండ్ ఔట్ ప్లేయర్‌గా అభివర్ణించిన హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్.. మహమ్మద్ సిరాజ్ టీమిండియా అసెట్ అని కొనియాడాడు.
ఇక కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌తో సుదీర్ఘ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్.. తన ఫస్ట్ మ్యాచ్‌లో సెంచరీ, హాఫ్ సెంచరీ బాదిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.
తాజాగా అతని ఆటతీరును మెచ్చుకుంటూ వీవీఎస్ లక్ష్మణ్ ఓ క్రీడా చానెల్‌తో మాట్లాడాడు.'ఈ సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ స్టాండ్ ఔట్ ప్లేయర్‌గా నిలిచాడు. తన తొలి టెస్టులోనే ఒత్తిడిని జయిస్తూ రాణించిన తీరు అద్భుతం. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడిన క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన అతను.. ప్రత్యర్థి బౌలర్లను ధీటుగా ఎదుర్కొని బ్యాటింగ్ చేశాడు. తర్వాత సెంచరీ సాధించాడు. ఇక టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లోనూ పీకల్లోతు కష్టాల్లో ఉండగా క్రీజులోకి వచ్చాడు. 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఒత్తిడిలో శ్రేయస్ అయ్యర్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడాడు. అర్ధ శతకం సాధించాడు. దీంతో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతడు మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ చేశాడు' అని లక్ష్మణ్ ప్రశంసించాడు.
అలాగే, హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ టీమిండియాకు గొప్ప ఆస్తి అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. 'రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ పక్కా ప్రణాళికతో బౌలింగ్ చేశాడు. షార్ట్ పిచ్ బంతులు, స్వింగర్లతో కివీస్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. టెస్టు మ్యాచ్ బౌలర్‌గా గొప్ప పరిణతి సాధించాడు. టీమిండియా.. ఆస్ట్రేలియా పర్యటనలో ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక బౌలర్లు దూరమైన సమయంలో సిరాజ్ అద్భుతంగా రాణించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో కూడా మెరుగ్గా రాణించాడు. అతని బౌలింగ్‌లో వైవిధ్యం ఉంది. కీలక సమయాల్లో కచ్చితత్వంతో బంతులేస్తూ.. ప్రత్యర్థి జట్టును దెబ్బతీయగలడు. అందుకే, టీమిండియాకు అతను గొప్ప ఆస్తి' అని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ఇక ముంబై వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ టాప్ ఆర్డర్‌ను సిరాజ్ కుప్పకూల్చిన విషయం తెలిసిందే. దాంతో న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే కుప్పకూలింది.