
హైదరాబాద్: గత సంవత్సరం సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన నుంచి మొదలుపెడితే.. ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే వరకు చాలామంది భారత ఆటగాళ్లు జట్టులోకి అరంగేట్రం చేశారు. మహ్మద్ సిరాజ్, టీ నటరాజన్, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ ఆస్టేలియా పర్యటన ద్వారా.. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ప్రసిద్ద్ కృష్ణలు ఇంగ్లండ్ సిరీస్ ద్వారా టీమిండియాలోకి వచ్చారు. అందరూ కూడా అరంగేట్రం చేసి పలు రికార్డులు నమోదు చేశారు. దీంతో ఈ ఏడాది చివరలో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌కు పోటీ పెరిగింది.
యువ ఆటగాళ్లతో ఫొటో నెలకొనడంతో టీ20 ప్రపంచకప్ జట్టు కూర్పు గురించి టీమిండియా టెస్టు స్పెషలిస్టు వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో లక్ష్మణ్ మాట్లాడుతూ... 'గత కొన్ని రోజులుగా యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ సిరీస్‌లో అందివచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఇషాన్ కిషన్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ ఆట తీరు కూడా అద్భుతం. గొప్ప ఇన్నింగ్స్ ఆడారు. తొలి మ్యాచులలోనే ఎలాంటి బెరుకు లేకుండా బ్యాటింగ్ చేశారు' అని ప్రశంసించారు.
'ఈ ఏడాది చివరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు సంబంధించి నా పదిహేను మంది స్వ్యాడ్‌లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లకు కచ్చితంగా స్థానం ఉంటుంది. తుది జట్టులో ఆడేందుకు వారిద్దరికి పూర్తి అర్హత ఉందని భావిస్తున్నా' అని హైదరాబాద్ సొగసరి లక్ష్మణ్ అన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన సూర్యకుమార్ మైండ్‌సెట్ తనను ఆశ్చర్యపరిచిందని లక్ష్మణ్ పేర్కొన్నారు.
రెండో టీ20 ద్వారా అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్.. ఆ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆడిన తొలి మ్యాచులో బ్యాటింగ్ చేసే అవకాశం రాని సూర్యకుమార్ యాదవ్.. నాలుగో టీ20లో 28 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసి అందరిచేతా ప్రశంసలు అందుకున్నాడు. ఈ ఇద్దరు ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున గత రెండేళ్లుగా నిలకడగా రాణిస్తున్నారు. దేశవాళీ టోర్నీల్లో కూడా పరుగుల వరద పారిస్తూ.. జాతీయ జట్టుకు ఎంపికయ్యారు.