
హైదరాబాద్: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మధ్య పోటీ ఉండదని, వారిద్దరూ పరస్పరం గౌరవించుకుంటారని భారత మాజీ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. కోహ్లీ, విలియమ్సన్ గొప్ప క్రికెటర్లని ఆయన ప్రశంసించారు. ఇద్దరు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను అద్భుత వాతావరణంలో ముందుకు నడిపించాలని సూచించారు. సుదీర్ఘ పర్యటన కోసం ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్న కోహ్లీసేన జూన్ 18 నుంచి సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తలపడనుంది. అనంతరం ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఢీకొట్టనుంది.
తాజాగా వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ... 'టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ మధ్య పోటీ ఏమాత్రం ఉండదు. పైగా వారిద్దరూ పరస్పరం గౌరవించుకుంటారు. నిజానికి కోహ్లీ, విలియమ్సన్ ఇద్దరూ ఆయా దేశాల్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా యువతకు ఆదర్శప్రాయులు. వారు తమతమ జట్లను నడిపిస్తున్న తీరు అమోఘం. సొంత ప్రతిభ, సామర్థ్యంపై ఆశావహ దృక్పథంతో ఉంటారు. సీనియర్లు వీడ్కోలు పలికాక జట్లను సమర్థంగా నడిపిస్తున్నారు' అని అన్నారు. 'క్రికెట్ ఆడుతున్నందుకు వారిద్దరూ గర్వపడుతుంటారు. దేశానికి ఆడుతున్నామా, ఐపీఎల్ లేదా క్లబ్ క్రికెట్ కోసమా అనేది పట్టించుకోరు. ఏ మ్యాచుకైనా ఒకేలా ఆడతారన్నారు.
'క్రికెట్ థియరీ ప్రకారం చెప్పాలంటే టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ పరిస్థితులు న్యూజిలాండ్‌కే అనుకూలం. ఎందుకంటే విదేశాల్లో ఎప్పుడు టెస్టు సిరీసులు ఆడాలన్నా.. ముందుగానే ఒకటో రెండో సన్నాహక మ్యాచులు ఆడటం ఆనవాయితీ. అప్పుడు ఆటగాళ్లు అక్కడి పరిస్థితులకు అలవాటు పడతారు. అందుకే కొన్నేళ్లుగా జట్లన్నీ ఇలాగే చేస్తున్నాయి. ముఖ్యంగా పరిస్థితులకు పర్యాటక బ్యాట్స్‌మెన్ అలవాటు పడటం అవసరం. న్యూజిలాండ్ ముందుగానే ఇంగ్లండ్ వెళ్లింది. కాబట్టి ఆ జట్టుకు ప్రయోజనం ఉంటుంది' అని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు.
'ఇంగ్లీష్ గడ్డపైకి న్యూజిలాండ్ ముందుగానే వెళ్లిందని.. టీమిండియా వెనుకంజలో ఉందనుకోవద్దు. ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో వారికి తెలుసు. ఆస్ట్రేలియాలో భారత జట్టు పోరాటం, సానుకూల దృక్పథాన్ని మనం చూశాం. సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లు సత్తా చాటారు. ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు కోహ్లీసేన కఠోరంగా సాధన చేస్తుంది. ఇది లభించే అంశమే' అని హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.
సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లండ్ చేరుకున్న భారత క్రికెటర్లు మూడు రోజుల పాటు కఠిన క్వారంటైన్‌లో ఉండనున్నారు. ప్రస్తుతం సౌతాంప్టన్‌లో బస చేస్తున్న ప్లేయర్లు ఒకరినొకరు కలుసుకునే వీలు లేకుండా క్వారంటైన్‌లో గడపనున్నారు. జూన్ 18 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. మ్యాచ్ ప్రాక్టీస్ కోసం టీమిండియాకు స్వల్ప సమయం మిగిలి ఉండగా.. కివీస్ మాత్రం ఇంగ్లండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది.