
కోహ్లీ బలహీనతలను సరిదిద్దుకోవాలి..
ఇక రిషభ్ పంత్ తనశైలిలో స్వేచ్చగా బ్యాటింగ్ చేయాలన్నాడు. రక్షణాత్మక దోరణీలో ఆడుతూ విఫలమవుతున్నాడని తెలిపాడు. గురువారం నుంచి ఇరు జట్ల మధ్య ఓవల్ వేదికగా జరగనున్న నాలుగో టెస్ట్ నేపథ్యంలో ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన వీవీఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "నాలుగో టెస్టు ప్రారంభానికి చాలా తక్కువ సమయం ఉంది. ఆ లోపు కోహ్లీ తన టెక్నిక్‌ను మార్చుకోవాలి. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పుజారా, కోహ్లీ క్రీజులో కుదురుకున్న తీరుని బట్టి భారత్ రాణిస్తుందనుకున్నా. కానీ, కోహ్లీ మరోసారి అదే తప్పు చేశాడు. అతడికి దూరంగా వెళ్తున్న బంతిని ఆడబోయి ఔటయ్యాడు. ఈ తప్పును వీలైనంత త్వరగా సరిదిద్దుకోవాలి" అని అన్నాడు.

పంత్ స్వేచ్చగా ఆడాలి..
అలాగే, యువ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్‌ను స్వేచ్ఛగా ఆడనివ్వాలని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. "పంత్ తన సహజశైలికి విరుద్ధంగా.. రక్షణాత్మకంగా ఆడుతూ ఆకట్టుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం అతడిపై ఒత్తిడి ఉండటం వల్ల స్వేచ్ఛగా ఆడలేకపోతున్నాడు. జట్టు యాజమాన్యం అతడితో మాట్లాడి స్వేచ్ఛగా ఆడేందుకు ప్రోత్సహిస్తే.. గొప్పగా రాణించగలడు. అది జట్టుకెంతో మేలు చేస్తుంది. భయం లేకుండా ఆడినప్పుడే పంత్ అత్యుత్తమ ప్రదర్శన చేయగలడు" అని పేర్కొన్నాడు.

ఎక్స్ట్రా బ్యాట్స్‌మన్ అవసరం..
'భారత జట్టులో బ్యాటింగ్ విభాగం సామర్థ్యం మేరకు రాణించడం లేదు. గత మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. వాళ్లంతా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌పై ఆధారపడుతున్నారు. కాబట్టి ఈ బలహీనతను అధిగమించేందుకు టీమిండియా మేనేజ్మెంట్ ఎక్స్ట్రా బ్యాట్స్‌మన్ తీసుకోవాలి. కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి ఈ దిశగా ఆలోచించాలి. ఇక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను కూడా జట్టులోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇంగ్లండ్ మిడిలార్డర్లో ముగ్గురు లెఫ్టాండ్ బ్యాట్స్‌మన్ ఉన్నారు'అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.

రహానేను కొనసాగించాలి..
ఇంగ్లండ్ గడ్డపై దారుణంగా విఫలమవుతున్న టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానేను లక్ష్మణ్ వెనకేసుకొచ్చాడు. 'అజింక్యా రహానే కచ్చితంగా అతని సామర్థ్యం మేరకు రాణించడం లేదు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే రహానేను నేను ఈ జట్టు లీడర్‌గా చూస్తున్నాను. అతను టీమ్ కోర్ గ్రూప్‌లో ఒకడు. ఆస్ట్రేలియా పర్యటనలో 36 పరుగులకే ఆలౌటైన తర్వాత కెప్టెన్‌గా అతనేం చేశాడో మనందరికి తెలుసు. మెల్ బోర్న్ వేదికగా అతను సెంచరీ.. ఆ పర్యటనలో భారత జట్టు పుంజుకునేలా చేసింది. అదో అద్భుతమైన ఇన్నింగ్స్. రహానే లాంటి ఎప్పుడైనా చెలరేగగలరు. అందుకే అతనిపై నాకు ఏ మూలనో నమ్మకం ఉంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో అతన్ని కొనసాగించాలనేది నా అభిప్రాయం.'అని వీవీఎస్ చెప్పుకొచ్చాడు.