Rahul Dravid: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. ఇక మాజీ కానున్నారు. ఆయన స్థానంలో కొత్త కోచ్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అన్వేషణ మొదలు పెట్టింది. టీ20 వరల్డ్ కప్ 2024 తరువాత దీనికి సంబంధించిన ఏర్పాట్లను మరింత ముమ్మరం చేయనుంది.
ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ ఆడబోతోంది టీమిండియా. ఈ నెల 27వ తేదీన ఐపీఎల్ ఫైనల్స్ ముగిసిన వారం రోజుల తరువాత అంటే జూన్ 2వ తేదీన టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ ఆరంభం కానుంది. 29వ తేదీ వరకు కొనసాగుతుంది.

ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్లేఆఫ్స్, ఫైనల్స్ ఆడబోయే ఫ్రాంఛైజీల ప్లేయర్లు మినహా టీమిండియాకు ఎంపికైన మిగిలిన క్రికెటర్లు ఈ నెల 24వ తేదీన వెస్టిండీస్‌కు బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది. ఈ టీ20 వరల్డ్ కప్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ- రాహుల్ ద్రావిడ్‌కు మాత్రం ఉద్వాసన తప్పదు.
రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ ముగిసిన అనంతరం దాన్ని రెన్యూవల్ చేయదలచుకోలేదు బీసీసీఐ. టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టింది. దీనికోసం దరఖాస్తులను ఆహ్వానించింది కూడా. హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 27. సాయంత్రం 6 గంటల్లోగా బీసీసీఐకి తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.
ఈ హెడ్ కోచ్ పదవికి ఫుల్ డిమాండ్ ఉంటుందని ఆశించినప్పటికీ.. దానికి భిన్నమైన వాతావరణం నెలకొంది. టీమిండియా మాజీ ప్లేయర్లు, స్వదేశీ ఆటగాళ్లెవరూ కూడా పెద్దగా హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి చూపట్లేదు. దరఖాస్తు దాఖలు చేసుకునే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోన్నారు.

హైదరాబాద్‌కు చెందిన మాజీ టెస్ట్ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం హెడ్ కోచ్ పదవిపై ఏ మాత్రం ఆసక్తిగా ఉండట్లేదని తెలుస్తోంది. ఇదివరకు తాత్కాలికంగా టీమిండియాకు హెడ్ కోచ్‌గా పని చేసిన అనుభవం ఉందాయనకు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి చీఫ్‌గా వ్యవహరిస్తోన్నారు లక్ష్మణ్. దీన్ని కాదనుకుని హెడ్ కోచ్‌గా దరఖాస్తు దాఖలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదు.
రాహుల్ ద్రావిడ్ సైతం మరోసారి ఇదే పదవికి అప్లికేషన్ పెట్టడానికీ ఇంట్రస్ట్‌గా లేరు. ఒకసారి హెడ్ కోచ్‌గా చేసిన వారు మరోసారి అదే పదవికి అప్లై చేయకూడదనే నిబంధన అంటూ బీసీసీఐలో ఏదీ లేదు. కావాలనుకుంటే రాహుల్ ద్రావిడ్ కూడా ఈ పోస్ట్‌కు మళ్లీ అప్లై చేసుకోవచ్చంటూ బీసీసీఐ స్పష్టం చేసింది కూడా. అయినప్పటికీ- ద్రావిడ్ మాత్రం దూరంగా ఉండాలనే నిర్ణయించుకున్నారు.