
భారత వెటరన్ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విశ్వసనీయ సమాచారం అందింది. జూన్ 26న ప్రారంభం కానున్న టీమిండియా ఐర్లాండ్ పర్యటన నిమిత్తం జట్టు కోచ్ బాధ్యతలను లక్ష్మణ్ స్వీకరించే అవకాశం ఉంది. అదే సమయంలో భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ రీషెడ్యూల్ చేసిన ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదో టెస్ట్ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నాడు. టీమిండియా సీనియర్ సభ్యుల జట్టును రాహుల్ ద్రావిడ్ నడిపించనుండగా.. ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్న జూనియర్ క్రికెటర్ల జట్టును వీవీఎస్ లక్ష్మణ్ నడిపించనున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జూన్ 19న పూర్తి అవుతుంది. తదనంతరం ద్రావిడ్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే జట్టుతో పాటు ఉంటాడు. ఇంగ్లాండ్‌లోని లీసెస్టర్‌లో నాలుగు రోజుల ప్రాక్టీస్ గేమ్ జూన్ 24 నుంచి 27వరకు జరగనుంది. ఇక ఆ తర్వాత బర్మింగ్ హామ్‌లో రీషెడ్యూల్ చేసిన ఐదో టెస్ట్ జరగనుంది. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ నాయకత్వంలో ఇంగ్లాండ్ టీమిండియాతో తలపడడానికి సిద్ధమైంది.
ఐర్లాండ్ పర్యటనకు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ అందుబాటులో ఉండని కారణంగా.. అతని స్థానాన్ని భర్తీ చేసే నిమిత్తం వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో క్రికెట్ డైరెక్టర్‌గా లక్ష్మణ్ పనిచేస్తున్నాడు. ఇక లక్ష్మణ్‌కు కోచింగ్ విభాగంలో మంచి అనుభవం ఉంది. బెంగళూరులోని ఎన్సీఏలో డైరెక్టర్‌గా పదవిని చేపట్టడానికి ముందు.. లక్ష్మణ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు, అలాగే భారత దేశీయ జట్టు బెంగాల్‌కు కోచ్‌గా పనిచేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో కరీబియన్‌లో ప్రపంచ కప్ గెలిచిన భారత అండర్-19 జట్టుకు కూడా వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
ఐపీఎల్ ముగిసిన తర్వాత 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు భారత్‌కు రానుంది. అనంతరం ఒకేసారి రెండు పర్యటనలు చేయాల్సి రావడంతో బీసీసీఐ.. టీమిండియా స్క్వాడ్‌ను రెండుగా విభజించనుంది. సీనియర్ సభ్యులతో ఒక జట్టును, జూనియర్ సభ్యులతో కూడిన మరో జట్టును రూపొందించనుంది. స్వదేశంలో జరగబోయే దక్షిణాఫ్రికా పర్యటనకు, అలాగే ఇంగ్లాండ్ టూర్‌కు భారత సీనియర్ ప్లేయర్ల జట్టు వెళ్లనుండగా.. ఐర్లాండ్‌కు దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆడిన కొందరు ప్లేయర్లు, కొంత మంది జూనియర్ ఆటగాళ్లతో కలిపిన ఓ జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.