
హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్‌కు తొలి నాళ్లలో కోచ్‌గా వ్యవహరించిన అశోక్ సింగ్ (64) మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ క్యాన్సర్‌కు శస్త్రచికిత్స తర్వాత 14 నెలల పాటు మృత్యువుతో పోరాడిన తండ్రి ప్రాణాలు వదిలారని అశోక్ కుమారుడు ఆనంద్ సింగ్ చెప్పారు. 30 ఏళ్ల పాటు కోచ్‌గా వ్యవహరించిన అశోక్.. లక్ష్మణ్, ఎమ్మెస్కే ప్రసాద్‌తో పాటు ఎంతో మంది యువ క్రికెటర్లకు తర్ఫీదు ఇచ్చారు.
అశోక్ సింగ్ మరణ వార్త తెలియగానే వీవీఎస్ లక్ష్మణ్ భావోద్వాగానికి లోనయ్యారు. అశోక్ మరణం తనకు తీరని లోటని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. 'అశోక్ గారి మరణం నాకు తీరని లోటు. ఆయన నాకు కోచ్ మాత్రమే కాదు.. పెద్దన్న లాంటి వారు. ఆట పట్ల ఎంతో అంకితభావం, మక్కువ ఉన్న అశోక్.. నాకు ఎప్పుడూ ప్రేరణ కలిగించే వారు. నేను మరింత మెరుగ్గా ఆడేలా చూశారు. నిన్నెంతో మిస్సవుతా అశోక్ భాయ్. నీ ఆత్మకు శాంతి కలగాలి' అని లక్ష్మణ్ ట్వీట్ చేశారు.

వీవీఎస్ లక్ష్మణ్ తోపాటు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌కు కూడా అశోక్ సింగ్ కోచ్‌గా వ్యవహరించారు. వివరాల ప్రకారం.. బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా అశోక్‌కు గతేడాది సర్జరీ నిర్వహించినట్లు తెలుస్తోంది. సర్జరీ పూర్తయిన తర్వాత 14 నెలలు అశోక్ జీవించగలిగారు. అనేక మంది ఆటగాళ్లకు 30 ఏళ్లుగా కోచింగ్ ఇచ్చిన అశోక్.. అప్పట్లో రంజీ ట్రోఫీకి ఎంపికైనా మ్యాచ్‌లో బరిలో దిగలేకపోయారు.
1998లో అశోక్ సింగ్ దగ్గర శిక్షణ తీసుకోవడం ప్రారంభించిన వీవీఎస్ లక్ష్మణ్.. తర్వాత ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. మొహమ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి గొప్ప కెప్టెన్ల సారథ్యంలోని భారత జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించేంత వరకు లక్ష్మణ్‌కు అశోక్ కోచ్‌గా వ్యవహరించారు. లక్ష్మణ్ భారత్ తరఫున 134 టెస్టులు, 86 వన్డేలు ఆడాడు. లక్ష్మణ్ ప్రస్తుతం ఐపీఎల్ టీం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మెంటర్‌గా ఉన్నాడు. యూఏఈలో జరుగుతున్నా ఐపీఎల్ 2020 నుంచి సన్‌రైజర్స్ నిష్క్రమించడంతో త్వరలో హైదరాబాద్ చేరుకోనున్నారు.