
మాజీ క్రికెటర్లకు కీలక స్థానాలు..
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ సౌరవ్ గంగూలి.. ఇప్పటికే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చీఫ్‌గా పని చేస్తున్నాడు. సౌరవ్ గంగూలి కేప్టెన్సీ గురించి చెప్పుకోనక్కర్లేదు. అతని హయాంలో భారత జట్టు ఓ వెలుగు వెలిగింది. టెస్ట్, వన్డే ఇంటర్నేషనల్స్ ఫార్మట్‌లో తిరుగులేని జట్టుగా ఆవిర్భవించింది. అత్యధిక విజయాలను అందుకున్న కేప్టెన్‌గా సౌరవ్ గంగూలికి పేరుంది. మరో మాజీ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్.. టీమిండియా కోచ్‌గా అపాయింట్ అయ్యాడు. క్రమశిక్షణకు కేరాఫ్‌గా ఉంటాడనే గుర్తింపు ఉంది ద్రవిడ్‌కు.

ఎన్సీఏ హెడ్‌గా
టీమిండియా మాజీ టెస్ట్ క్రికెటర్, హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్‌కు కీలక పదవి వరించింది. నేషనల్ క్రికెట్ అకాడమీకి అధిపతిగా నియమితుడు కానున్నాడు. ఈ విషయాన్ని సౌరవ్ గంగూలీ కొద్దిసేపటి కిందటే ధృవీకరించాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. నేషనల్ క్రికెట్ అకాడమీకి హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ పేరును ఖరారు చేసినట్లు చెప్పాడు. లాంఛనప్రాయంగా అతని నియామకాన్ని ఆమోదించాల్సి ఉందని పేర్కొన్నాడు.

వీవీఎస్ తప్ప..
రాహుల్ ద్రవిడ్ గానీ, వీవీఎస్ లక్ష్మణ్ గానీ.. సౌరవ్ గంగూలీ కేప్టెన్సీలో.. జాతీయ జట్టు తరఫున ఆడినవారే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. క్రికెట్‌ను అమితంగా ప్రేమించే వారిద్దరి సేవలను భవిష్యత్ తరాల కోసం వినియోగించుకోనున్నామని గంగూలి చెప్పాడు. నేషనల్ క్రికెట్ అకాడమీకి వీవీఎస్ లక్ష్మణ్ కంటే మరెవరూ న్యాయం చేయలేరని బీసీసీఐ కార్యదర్శి జయ్ షా సైతం భావిస్తున్నాడని అన్నాడు. తామిద్దరం ఓ నిర్ణయానికి వచ్చిన తరువాతే వీవీఎస్ పేరును ఎన్సీఏ హెడ్ కోసం ఖరారు చేశామని వివరించాడు.

అండర్-19 కూడా..
నేషనల్ క్రికెట్ అకాడమీని మాత్రమే కాకుండా.. టీమిండియా అండర్-19, టీమిండియా-ఏ టీమ్ బాధ్యతలను కూడా వీవీఎస్ లక్ష్మణ్ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఈ రెండు జట్లకు అతను కోచ్‌గా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదని చెప్పాడు. ఇదివరకు నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్‌గా రాహుల్ ద్రవిడ్ పనిచేశాడు. అతణ్ని టీమిండియా హెడ్ కోచ్‌గా అపాయింట్ చేయడంతో ఈ పదవికి రాజీనామా చేశాడు. అతని స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ అపాయింట్ కానున్నాడు.

అపారమైన క్రికెట్ ఆడిన అనుభవజ్ఞులు..
బీసీసీఐ, టీమిండియా కోచ్, ఎన్సీఏ హెడ్‌గా అపారమైన క్రికెట్ ఆడిన మాజీ ప్లేయర్లు బాధ్యతలను స్వీకరించడం బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినట్టవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. టీమిండియా కొత్త కోచ్‌గా రాహుల్ ద్రవిడ్, వన్డే ఇంటర్నేషనల్స్-టెస్ట్ పార్మట్ కేప్టెన్‌గా విరాట్ కోహ్లీ, టీ20 ఫార్మట్‌కు రోహిత్ శర్మ నాయకత్వాన్ని వహించబోతోండటం.. ఓ శకానికి నాంది పలికినట్టయింది. వారి నాయకత్వంలో డొమెస్టిక్ క్రికెట్.. ఎలాంటి కొత్త పుంతలు తొక్కుతుందనేది చర్చనీయాంశమైంది.