హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో వన్డే జరిగి విశాఖపట్నం పిచ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌తో గత ఆదివారం (అక్టోబర్ 29)న జరిగిన ఐదో వన్డేలో న్యూజిలాండ్ జట్టు 79 పరుగులకే కుప్పకూలడం చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా దీపావళి కానుక: సత్తా చాటిన బౌలర్లు, భారత్ ఘన విజయం
వన్డే మ్యాచ్‌కు ముందు విశాఖపట్నం వేదికగా అసోం-రాజస్థాన్ మధ్య జరిగిన రంజీ మ్యాచ్‌లో కూడా ఒకేరోజు 17 వికెట్లను బౌలర్లు తీసుకోవడంతో అసోం కోచ్ సునీల్ జోషి ఇది నాసిరకం పిచ్ అంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ పిచ్‌పై అంతర్జాతీయ వన్డే, టెస్టు మ్యాచ్‌లు ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించాడు.
విశాఖ పిచ్‌పై బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేశాడు. అయితే వన్డే, టెస్టు మ్యాచ్‌లు ఎక్కడ జారిపోతాయనే ఉద్దేశ్యంతో పట్టువదలకుండా, పిచ్‌ను మళ్లీ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు ఆతిధ్యమిచ్చేందుకు అనుకూలంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తయారు చేయించింది.

ఆ తర్వాత బీసీసీఐ నుంచి వచ్చిన క్యూరేటర్ కస్తూరి రంగన్ విశాఖ పిచ్‌ను పరిశీలించి, అంతర్జాతీయ మ్యాచ్‌లను జరిపించొచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఈనెల 29న భారత్-కివీస్ మధ్య జరగాల్సిన చివరి, ఐదో వన్డే యథాతథంగా జరిగిన సంగతి తెలిసిందే.
అయితే అక్టోబర్ 29న భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డేలో ఐదుగురు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లు డకౌట్ కాగా, ఇద్దరు ఒక్క అంకె స్కోరుకే పరిమిమతయ్యారు. ఈ మ్యాచ్‌లో మొత్తం 16 వికెట్లను బౌలర్లు తీసుకున్నారు. మ్యాచ్‌కు ముందు పిచ్‌పై నిర్వాహకులు చేసిన ప్రకటనలకు, వాస్తవ పరిస్థితికి పొంతన లేకపోవడంతో పిచ్‌పై మరోసారి విమర్శలు వస్తున్నాయి.
దీనిపై ఏసీఏ కార్యదర్శి గోకరాజు స్పందించారు. 'పిచ్‌లో లోపం లేదు. రంజీ ఆడిన పిచ్‌పై వన్డే మ్యాచ్ నిర్వహించలేద'ని తెలిపారు. అయితే వన్డే జరిగిన తీరు చూస్తే స్టేడియంలోని మొత్తం పిచ్‌లపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 17న భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖలో రెండో టెస్టు జరగనుండటంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.