
అనిశ్చిత పరిస్థితుల్లో..
ఈ రకమైన అనిశ్చిత పరిస్థితులు.. ప్రతికూల వాతావరణంలో రషీద్ ఖాన్ రెచ్చిపోతోన్నాడు. క్రికెట్‌పై నుంచి తన ధ్యాసను మళ్లించడానికి ఏ మాత్రం సిద్ధంగా లేడతను. ఇదివరకటి కంటే మరింత రాటు దేలినట్టు కనిపిస్తోన్నాడు. ఇప్పటిదాకా బంతితోనే సత్తా చాటుతూ వచ్చిన రషీద్ ఖాన్ ఈ సారి బ్యాట్‌తోనూ చెలరేగిపోయాడు. ఆకాశమే హద్దుగా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని విజృంభణ ఏ స్థాయిలో కొనసాగిందంటే- ఓడిపోవాల్సిన మ్యాచ్‌ను ఎగరేసుకెళ్లింది సస్సెక్స్ టీమ్.

విటాలిటీ బ్లాస్ట్‌లో అద్భుతం..
ఇంగ్లాండ్‌లో కొనసాగుతోన్న విటాలిటీ బ్లాస్ట్ టోర్నమెంట్‌లో పరుగుల సునామీని సృష్టించాడు రషీద్ ఖాన్. దుర్హంలోని ఛెస్టర్-లె-స్ట్రీట్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓ అద్భుతాన్నే ఆవిష్కరించాడు. ఓడిపోయే మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. తన జట్టును సెమీ ఫైనల్స్‌కు చేర్చాడు. రషీద్ ఖాన్ బ్యాటింగ్ విశ్వరూపం ముందు యార్క్‌షైర్ బౌలర్లు చేతులెత్తేశారు. చిట్టచివరి ఓవర్ వరకూ పకడ్బందీగా బంతులను సంధించిన యార్క్‌షైర్ బౌలర్లకు సినిమా చూపించాడు రషీద్ ఖాన్.

ఫస్ట్ క్వార్టర్‌లో యార్క్‌షైర్‌తో
ఛెస్టర్-లె-స్ట్రీట్ స్టేడియంలో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సస్సెక్స్, యార్క్‌షైర్ పోటీ పడ్డాయి. రషీద్ ఖాన్ సస్సెక్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్ టామ్ కోహ్లెర్-క్యాడ్మోర్, గ్యారీ బల్లాన్స్ దూకుడుగా ఆడారు. కోహ్లెర్ మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 49 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఆ ఇద్దరి దూకుడు మంత్రం ముందు సస్సెక్స్ బౌలర్ల వ్యూహాలేవీ ఫలించలేదు.

ఒక వికెట్‌తోనే సరిపెట్టుకున్న రషీద్..
మిడిలార్డర్‌లో గ్యారీ బల్లాన్స్ 37 బంతుల్లో అయిదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 55 రన్స్ సాధించాడు. రషీద్ ఖాన్ బంతితో రాణించలేకపోయాడు. ఒక వికెట్ మాత్రమే పడగొట్టగలిగాడు. ఎప్పట్లా పొదుపుగా బౌలింగ్ చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటా 25 పరుగులు ఇచ్చాడు. టైనల్ మిల్స్ మూడు, జార్జ్ గ్యార్టన్, ఆర్చీ లెన్హామ్, క్రిస్ జోర్డాన్ తలో వికెట్ తీసుకున్నారు. బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో యార్క్‌షైర్ భారీ లక్ష్యాన్ని తన ప్రత్యర్థి సస్సెక్స్ ముందు ఉంచగలిగింది.

బ్యాటింగ్‌లో విశ్వరూపం..
178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన సస్సెక్స్ జట్టు ఆరంభంలో అదరగొట్టింది. 8.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 72 పరుగులను జోడించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ 25 బంతుల్లో రెండు ఫోర్లతో 27 పరుగులు, ల్యూక్ రైట్ 39 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 54 రన్స్ చేశారు. ఆ తరువాత మిగిలిన బ్యాట్స్‌మెన్లెవరూ రాణించలేకపోయారు. యార్క్‌షైర్ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు వికెట్లను సమర్పించుకున్నారు. రవి బొపారా-9, డెల్రే రౌలిన్స్ 27, డేవిడ్ వీజ్ 19 పరుగులు చేసి, అవుట్ అయ్యారు.
చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు చేయాల్సిన దశలో..
చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు చేయాల్సిన దశకు చేరంది సస్సెక్స్ టీమ్. డేవిడ్ వీజ్ కూడా అవుట్ కావడంతో ఓటమి తప్పదనే భావించారు సస్సెక్స్ అభిమానులు. ఆ దశలో రషీద్ ఖాన్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 16వ ఓవర్ చివరి బంతికి సిక్స్ బాది తన పరుగుల ఖాతాను తెరిచిన రషీద్ ఖాన్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. 17వ ఓవర్ మూడో బంతిని సిక్స్‌గా మలిచాడు. 12 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన దశలో ఉన్న సమయంలో హ్యాట్రిక్ బౌండరీలను బాదాడు. ఈ బంతిని అతను హెలికాప్టర్ షాట్ ఆడాడు. అచ్చంగా టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్రసింగ్ ధో్నీని దించేశాడు. ఆ బంతిని అతను ఫెన్సింగ్ దాటించిన తీరు బ్యాటింగ్ ప్రొఫెషనలిజానికి అద్దం పట్టింది.
మలుపు తిప్పిన 18వ ఓవర్..
యార్క్‌షైర్ బౌలర్ విల్లీ వేసిన 18వ ఓవర్‌లో రషీద్ ఖాన్ వరుసగా ఫోర్లు కొట్టాడు. 2,3,4 బంతులను బౌండరీలుగా మలిచాడు. దీనితో ఆ ఓవర్‌లో మొత్తంగా 16 పరుగులు వచ్చాయి. దీనితో సమీకరణాలు చివరి ఆరు బంతులకు ఆరు పరుగులుగా మారిపోయాయి. చివరి ఓవర్ తొలి రెండు బంతుల్లో సింగిల్స్ తీశారు రషీద్ ఖాన్, క్రిస్ జోర్డాన్.మూడో బంతికి పరుగులేవీ రాలేదు. నాలుగో బంతికి క్రిస్ జోర్డాన్ ఫోర్ కొట్టడంతో మ్యాచ్.. సస్సెక్స్ వశమైంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ రిలీఫ్..
వచ్చేనెల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో విడత టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ దశలో
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ రిలీఫ్ కల్పించాడు రషీద్ ఖాన్. ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిణామాల మధ్య రషీద్ ఖాన్ ఆటతీరు ప్రభావితం కావొచ్చంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో- సన్‌రైజర్స్ హైదరాబాద్ టెన్షన్‌కు గురైంది. వాటన్నింటినీ అతను పటాపంచలు చేశాడు. ఆటపై తనకు ఉన్న ఏకాగ్రత ఏ మాత్రం చెదిరిపోలేదనే సందేశాన్ని పంపించాడు.


Click it and Unblock the Notifications












