
హైదరాబాద్: దేశంలో భారీ స్కామ్‌లు, దోపిడీలు చేసిన ప్రముఖులు విదేశాలకు ఎంచక్కా పారిపోయి ఎంజాయ్ చేస్తుంటే... కేజీ బియ్యం దొంగతనం చేసినందుకు గాను ఓ వ్యక్తిని చంపేశారు. ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. ఆకలి వేసి ఓ కేజీ బియ్యం దొంగతనం చేసినందుకు మధు అనే వ్యక్తిని ఇటీవల దారుణంగా కొట్టి చంపారు.
ఈ ఘటనకు కారణమైన వ్యక్తులు కొందరు మధును రక్షించకపోగా.. గాయాలతో ఉన్న అతనితో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. తాజాగా ఈ ఘటనపై సెహ్వాగ్ అసహనం వ్యక్తం చేశాడు. మధును చంపేసిన సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని ట్వీట్ చేశాడు.
'మధు కేవలం ఒక కేజీ బియ్యం దొంగిలించాడు. అందుకే ఆ పేద గిరిజన వ్యక్తిని ఉబైద్, హుస్సేన్, కరీమ్ అనే వ్యక్తులతో కూడిన గుంపు చంపేసింది. ఇది సమాజానికి మాయని మచ్చ. ఇంత ఉన్నత సమాజంలో ఈ ఘటన జరిగినందుకు నేను సిగ్గుపడుతున్నాను' అంటూ ట్వీట్ చేశాడు.
అసలేం జరిగింది?
కేరళలోని 30 ఏళ్ల మతిస్థిమితం లేని గిరిజన యువకుడు దొంగతనానికి పాల్పడ్డాడనే కారణంతో దారుణంగా కొట్టారు. అలా కొడుతుంటే సాటి మనుషులుగా ఆపాల్సింది పోయి దాడి జరిగే సమయంలో సెల్ఫీలకోసం పోటీ పడ్డారు. వీరిలో అధికంగా చదువుకున్న యువకులే ఉండటం విశేషం. తీవ్రంగా గాయాలపైన ఆ యువకుడిని పోలీసులు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.
దీంతో ఈ ఘటనలో నేరుగా ప్రమేయమున్న ఇద్దరు వ్యక్తులు సహా మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడి పేరు మధు. వయసు 27 ఏళ్లు. మతిస్థిమితం లేని వాడు. కేరళలో బాగా వెనుకబడిన పాలక్కడ్ జిల్లాలోని అట్టప్పాడిలోని కడుకూమన్న గిరిజన ప్రాంతం.

మానసిక స్థితి సరిగాలేక కొన్ని నెలల క్రితమే ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అట్టప్పాడి గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో తిరుగుతూ బతికేస్తున్నాడు. ఆకలి తీర్చుకోవడానికని గురువారం స్థానిక దుకాణాల నుంచి ఆహార పదార్థాలను తీసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు దొంగతనం చేశాడని అతడిని కట్టేసి కొన్ని గంటలపాటు చిత్రహింసలు పెట్టారు.
చివరకు ఓ వ్యక్తి పోలీసులకు కబురు చేయడంతో వారు వచ్చి అతడిని విడిపించారు. పోలీసులు ఆసుపత్రికి తరలిస్తుండగానే... మధు వాంతులు చేసుకున్నాడు. స్పృహతప్పి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని తీసుకెళ్తుండగా గిరిజన సంఘాలు వారిని అడ్డుకున్నాయి.