టీమిండియా లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రపంచం నలుమూలల నుంచి మాజీ క్రికెటర్లు, అభిమానులు అతనికి బర్త్ డే విషెస్ పంపుతున్నారు. సహచర ఆటగాళ్లు కూడా ధోనీపై తమ ఆప్యాయతను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో మాజీ లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ధోనీకి బర్త్ డే విషెస్ చెప్తూ ఒక ట్వీట్ చేశాడు.
ధోనీ తన క్రికెటింగ్ కెరీర్‌లో 7వ నెంబర్ జెర్సీతో ఆడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో కూడా ధోనీ అదే నెంబర్ జెర్సీలో ఆడుతున్నాడు. ధోనీ పుట్టింది ఏడో నెలలో, ఏడో తేదీన కూడా కావడం గమనార్హం. తన విషెస్‌లో కూడా ఇదే నెంబర్‌ను ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు సెహ్వాగ్. దీంతో ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌లో తనదైన స్టైల్‌లో ధోనీని సెహ్వాగ్ మెచ్చుకున్నాడు.

'సూర్యుడి రథానికి ఏడు గుర్రాలుంటాయి. ఋగ్వేదంలో ప్రపంచంలో ఏడు భాగాలున్నట్లు చెప్పారు. ఏడు సముద్రాలు, ఏడు కోటలు, సంగీతంల ఏడు బేసిక్ నోట్స్, పెళ్లిలో ఏడు ప్రమాణాలు ఉంటాయి. ప్రపంచంలో ఏడు వింతలున్నాయి. అదే వరుసలో ఏడో నెలలో ఏడో రోజున ఎంఎస్ ధోనీ అనే గొప్ప వ్యక్తి బర్త్ డే ఉంది. హ్యాపీ బర్త్ డే ధోనీ' అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
ధోనీ బర్త్ డేను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఫ్యాన్స్ అయితే ధోనీ కోసం అతి భారీ కటౌట్‌లు ఏర్పాటు చేసి, పాలాభిషేకాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సెహ్వాగ్ ట్వీట్ కూడా ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. ధోనీ నేతృత్వంలో వరల్డ్ కప్ నెగ్గిన జట్టులో సెహ్వాగ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.