న్యూఢిల్లీ : మూడో టెస్టులోను అద్బుత ఆటతీరుతో టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మూడో టెస్టులో 13వికెట్లతో.. అటు మ్యాచ్ తో పాటు ఇటు సిరీస్ ను కైవసం చేసుకోవడానికి అశ్విన్ ప్రదర్శన టీమ్ ఇండియాకు ఎంతగానో ఉపయోగపడింది.
దీంతో.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా అశ్విన్ ను వరించిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఏడోసారి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ను ఈ టెస్టు సిరీస్ ద్వారా తన ఖాతాలో వేసుకున్నాడు అశ్విన్. ఇదంతా ఇలా ఉంటే.. ఈమధ్య కాలంలో ట్విట్టర్ ద్వారా అభిమానులను అలరిస్తోన్న టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అశ్విన్ పై ఆసక్తికర ట్వీట్స్ చేయడం, దానికి అశ్విన్ భార్య, ఆపై సెహ్వాగ్ భార్య కూడా స్పందించడంతో.. ప్రస్తుతం ఆ ట్వీట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
ఇంతకీ సెహ్వాగ్ చేసిన ట్వీట్ ఏంటంటే.. 'అద్భుత ఆటతీరుతో ఏడోసారి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచినందుకు అభినందనలు. తొందరగా మ్యాచ్ ముగించేసి ఇంటికెళ్లాల్సిన తొందరేంటో పెళ్లయినవాళ్లకు మాత్రమే అర్థమవుతుంది' అంటూ అశ్విన్ గురించి ట్వీట్ చేశాడు సెహ్వాగ్. దీంతో.. కామెంట్ పై సరదాగా స్పందించిన అశ్విన్ భార్య.. 'హాహాహా.. నేనేం చేయనండి' అంటూ బదులిచ్చింది.
ఇంతలో సెహ్వాగ్ భార్య ఎంటరై.. నేను కూడా ఏం చేయను.. వాళ్లిద్దరికే ఎప్పుడూ తొందరెక్కువ అంటూ ట్వీట్ ద్వారా స్పందించింది. దీంతో ఈ సరదా సంభాషణ ఇప్పుడు ట్విట్టర్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.