న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. ఈ సీజన్లో విరాట్ చేసినన్ని తప్పులు తన కెరీర్ మొత్తంలో చేయలేకపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య ఈ మ్యాచ్ బరిలోకి దిగిన విరాట్(7).. తీవ్రంగా నిరాశపరిచాడు. వికెట్లకు దూరంగా వెళ్లే బంతిని ఆడి కీపర్‌కు చిక్కాడు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ బ్యాటింగ్ తీరుపై స్పందించిన సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ఆటగాళ్లు ఫామ్‌లో లేనప్పుడు ఆత్మవిశ్వాసం కోసం దొరికిన ప్రతి బంతినీ కొట్టాలనుకుంటారు. తొలి ఓవర్లో అతను కొన్ని బంతులు వదిలేసినా చివరికి దూరంగా వెళ్లే బంతిని వేటాడి ఔటయ్యాడు. అలా ప్రతి బంతినీ ఆడితే కొన్ని సార్లు అదృష్టం కలిసి రావచ్చు. మరికొన్ని సార్లు రాకపోవచ్చు. ఇక్కడ కూడా అదే జరిగింది. మరోవైపు కోహ్లీ ఈ సీజన్లో చేసినన్ని తప్పులు బహుశా తన కెరీర్ మొత్తంలో చేసి ఉండకపోవచ్చు.
పరుగులు చేయలేక తంటాలు పడుతున్నప్పుడు ఆటగాళ్లు ఇలాగే ఏవేవో షాట్లు ఆడాలని ప్రయత్నించి ఏదో విధంగా ఔటవుతుంటారు. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో అతను ఔటైన బంతిని వదిలేయాల్సింది. లేదా దంచికొట్టాల్సింది. ఇంత కీలక మ్యాచ్‌లో సరిగ్గా ఆడలేక అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాడు' అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూ రు 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్స్ లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం రాజస్తాన్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 161 పరుగులు సాధించి గెలిచింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' బట్లర్ (60 బంతుల్లో 106 నాటౌ ట్; 10 ఫోర్లు, 6 సిక్స్ లు) సీజన్లో నాలుగో సెంచరీతో చెలరేగాడు. రేపు జరిగే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్తాన్ తలపడుతుంది.