
భారత క్రికెట్‌లో డ్యాషింగ్ బ్యాటర్ పేర్లు చెప్పాలంటే అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు వీరేంద్ర సెహ్వాగ్. వన్డేల్లో డబుల్ సెంచరీ, టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తనకంటూ భారత క్రికెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వీరేంద్రుడు.. రిటైర్‌మెంట్ తర్వాత కూడా తన ముక్కుసూటి మాటలతో వార్తల్లో నిలుస్తుంటాడు. ఈ క్రమంలోనే టీమిండియా హెడ్ కోచ్‌గా అవకాశం వచ్చినా తాను ఎందుకు ఈ బాధ్యతలు తీసుకోలేదో సెహ్వాగ్ వెల్లడించాడు.
'విరాట్ కోహ్లీ, అలాగే అప్పటి బీసీసీఐ సెక్రటరీ అమితాబ్ చౌదరీ అడగటం వల్లనే నేను హెడ్ కోచ్ పొజిషన్ కోసం అప్లై చేశా. అమితాబ్‌తో మాట్లాడినప్పుడు.. కోహ్లీకి, అనిల్ కుంబ్లేకి పడటం లేదని చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కుంబ్లే కాంట్రాక్ట్ అయిపోతుందని, అప్పుడు వెస్టిండీస్ పర్యటన సమయంలో కావాలంటే జట్టుతో పాటు నేను కూడా వెళ్లొచ్చని ఆఫర్ ఇచ్చాడు' అని సెహ్వాగ్ అప్పుడు జరిగిన ఘటనలను గుర్తుచేసుకున్నాడు. అయితే అప్పుడు తను ఒక కండిషన్ పెట్టానని, దానికి అమితాబ్ ఒప్పుకోకపోవడంతో తాను కోచ్ పదవి తీసుకోలేదని వెల్లడించాడు.
'అమితాబ్ ఇచ్చిన ఆఫర్‌కు నేను యస్ అని కానీ, నో అని కానీ సమాధానం ఇవ్వలేదు. కానీ వెస్టిండీస్‌కు నేను వెళ్లాలంటే మాత్రం.. నా కోచింగ్ స్టాఫ్‌తోనే వెళ్తానని కరాఖండీగా చెప్పేశా. అసిస్టెంట్ కోచ్, బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్.. వీళ్లంతా నా టీం అయ్యుండాలని చెప్పా. సపోర్ట్ స్టాఫ్ విషయంలో కూడా నా చాయిస్ కావాలన్నా. అది నాకు ఇవ్వలేదు. అందుకే నేను కూడా వెస్టిండీస్ వెళ్లలేదు' అని కుండ బద్దలు కొట్టాడు.
అద్భుతమైన ప్లేయర్‌గా పేరొందినా కూడా సెహ్వాగ్‌కు తన కెరీర్‌లో టీమిండియా ఫుల్‌టైం కెప్టెన్‌గా అవకాశం రాలేదు. అయితే ఈ విషయంలో తానేం బాధపడటం లేదని సెహ్వాగ్ చెప్పాడు. 'నజఫ్‌గఢ్‌లో చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను దేశానికి ఆడటమే కాదు, ఎంతో ప్రేమాభిమానాలు సంపాదించాను. భారత జట్టుకు సారధ్యం వహించినా కూడా ఇంతే గౌరవాభిమానాలు దక్కేవి' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.