
ధోనీకి ఇంకా జట్టులో చోటెక్కడుంది:
తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ... 'జట్టులో ధోనీకి చోటు ఎక్కడుంది?. అతడు ఎక్కడ సరిపోతాడు. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ ఇప్పటికే ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా రాహుల్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లలో రాహుల్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఇంకా ధోనీ గురించి ఆలోచించేందుకు కారణం ఏముంది' అని అన్నాడు. సెహ్వాగ్ మాటలను బట్టి చూస్తే.. ధోనీ రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పకనే చెప్పాడు.

దిగ్గజాలకూ ఆ పరిస్థితులు ఎదురయ్యాయి:
న్యూజిలాండ్‌లో విఫలమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ డాషింగ్ ఓపెనర్ అండగా నిలిచాడు. 'కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. అతడు ఏ సంధి దశను ఎదుర్కుంటున్నాడో.. గతంలో దిగ్గజాలకూ ఆ పరిస్థితులు ఎదురయ్యాయి. వేర్వేరు కాలాల్లో సచిన్ టెండూల్కర్, స్టీవ్ వా, జాక్వెస్ కలిస్, రికీ పాంటింగ్ గడ్డుకాలం ఎదుర్కొన్నారు. వన్డే, టెస్టుల్లో కివీస్ మన కన్నా అత్యుత్తమంగా ఆడిందని ఒప్పుకోవాల్సిందే. వన్డేల్లో మార్చ్ చూపెట్టింది. టీ20ల్లోనూ కివీస్ విజయాలకు సమీపించింది. అయితే పొట్టి క్రికెట్లో వెంటనే పుంజుకోవడం అంత సులభం కాదు' అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు విరామం:
ఐసీసీ 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం ఇచ్చాడు. ఆ తర్వాత భారత్ ఆడిన ఏ సిరీస్‌కూ అందుబాటులో లేడు. ఈ క్రమంలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ (టీ20 సిరీస్), శ్రీలంక, ఆస్ట్రేలియా, కివీస్, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు దూరమయ్యాడు. దీంతో మహీ భవితవ్యంపై సందేహాలు తలెత్తాయి. కొందరు మాజీలు రిటైర్మెంట్ ప్రకటించాలని సూచించగా.. మరొకొందరు ఆడాలని సూచించారు.

ఐపీఎల్ రద్దైతే ధోనీ పరిస్థితి ఏంటో:
ఆరు నెలలుగా ధోనీ క్రికెట్ ఆడకపోవడంతో బీసీసీఐ అతడి కాంట్రాక్టును పునరుద్ధరించలేదు. పదేపదే మహీ వీడ్కోలుపై వదంతులు రావడంతో బీసీసీఐ, రవిశాస్త్రి వివరణలు ఇచ్చారు. ఐపీఎల్-13లో బాగా ఆడితే.. సెప్టెంబర్ నెలలో ఆసీస్ గడ్డపై జరిగే టీ20 ప్రపంచకప్ జట్టుకు మహీని పరిశీలిస్తామని శాస్త్రి తెలిపారు. మహీ కూడా ఐపీఎల్ కోసం చెన్నై వచ్చి ప్రాక్టీస్ చేసాడు. అయితే కరోనా ముప్పుతో ప్రస్తుతం ఐపీఎల్ వాయిదా పడింది. పరిస్థితులు మెరుగవ్వకపోతే టోర్నీని రద్దు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ధోనీ పరిస్థితి ఏంటో తెలియడం లేదు.


Click it and Unblock the Notifications












