
హైదరాబాద్: బెంగళూరు వేదికగా శనివారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ట్విట్టర్‌లో తనదైన శైలిలో ట్వీట్లు చేసే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్ వేలంపై కూడా తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. ఫ్రాంచైజీలు ఉత్తమ ఆటగాళ్లను దక్కించుకొనేందుకు కోట్ల రూపాయలతో పోటీపడుతున్నాయి.
కింగ్స్ ఎలెవన్ జట్టుకు మెంటార్‌గా ఉన్న సెహ్వాగ్ ఆ జట్టు సహా యజమాని ప్రీతి జింటాపై ఓ సరదా ట్వీట్ చేశాడు. 'సాధారణంగా అమ్మాయిలకు షాపింగ్ అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు ప్రీతి ఫుల్ షాపింగ్ మూడ్‌లో ఉంది. ఏదీ కనిపించినా కొనుగోలు చేస్తోంది' అని ట్వీట్ చేశాడు.
ఆటగాళ్ల వేలంపై 'చిన్నప్పుడు మనం కూరగాయలు కొనేందుకు వెళితే.. అమ్మ ధర సరిగ్గా చూసి కొనమని చెప్పేది. ఇప్పుడు మేం ఆటగాళ్లను కొనడానికి వెళ్తున్నాం. తేడా ఏంటంటే.. ఇప్పుడు ఓనర్ చెబుతారు.. సరైన ధరకి కొనమని' అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే ఐపీఎల్ వేలానికి ముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఒక్క అక్షర పటేల్‌ను మాత్రమే అట్టిపెట్టుకుంది. అయితే శనివారం జరిగిన వేలంలో కర్ణాటక యువ ఆటగాడు కేఎల్ రాహుల్‌కు అత్యధికంగా రూ.11 కోట్లు వెచ్చించి కోనుగోలు చేయగా, రవిచంద్రన్ అశ్విన్‌ను రూ.7.6 కోట్లతో కొనుగోలు చేసింది.
తొలిరోజు జరిగిన వేలంలో పంజాబ్ జట్టు కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే:
* అరోన్ ఫించ్ - రూ. 6.2 కోట్లు
* మార్కస్ స్టోయినిస్ - రూ. 6.2 కోట్లు
* కరుణ్ నాయర్ - రూ. 5.6 కోట్లు
* డేవిడ్ మిల్లర్ - రూ. 3 కోట్లు
* యువరాజ్ సింగ్ - రూ. 2 కోట్లు
* మయాంక్ అగర్వాల్ - రూ. కోటి
* అంకిత్ రాజ్‌పుత్ - రూ. 3 కోట్లు
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.