న్యూఢిల్లీ: రిటైర్మెంట్ తర్వాత సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటున్న భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి తన ట్వీట్ పంచ్‌తో మన ముందుకు వచ్చాడు. మైదానంలో బంతిని ఎంత బలంగా బాదేవాడో... ఇప్పుడు సెహ్వాగ్ చేసే ట్వీట్లు కూడా అంతబలంగా దూసుకుపోతున్నాయి.
తాజాగా శనివారం ట్విటర్లో సెహ్వాగ్ పెట్టిన పోస్టుకు నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. భార్య ఆర్తితో కలిసి ఓ సెల్ఫీ తీసుకుని దానికి ఓ మంచి క్యాప్షన్ పెట్టాడు. అదేమంటే.. 'కుటుంబానికి తలకాయ భర్త.. అయితే తలను అటూ ఇటూ తప్పే మెడలాంటిది భార్య..' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
అసలే సెహ్వాగ్ ట్వీట్.. అది కూడా ఇలావుంటే నెటిజన్లు స్పందించకుండా ఉంటారా? క్షణాల్లో ఈ పోస్టు విపరీతంగా వైరల్ అయింది. 2 వేలకు పైగా రీట్వీట్లు... 25వేల లైకులు వెల్లువలా వచ్చిపడ్డాయి. అంతేనా దాదాపు వెయ్యిమంది వీరు వ్యాఖ్యలకు స్పందిస్తూ సరదాగా కామెంట్లు పెట్టారు.
మరికొందరైతే వీరులాగనే తమ భార్యలతో సెల్ఫీ తీసుకుని పోస్టు చేస్తుండటం గమనార్హం. వాహ్వా సెహ్వాగ్ అంటూ నెజిజన్లు తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఈ ట్వీట్ సెహ్వాగ్ పవరే కాదు.. భార్య పవర్ ఎంటో కూడా తెలియజేసినట్లయింది.