హైదరాబాద్: భారత జట్టుకు అత్యధిక విజయాలనందించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన మహేంద్ర సింగ్ ధోని బుధవారం వన్డే, టీ20ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ధోని తీసుకున్న నిర్ణయం ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకోవడాన్ని చాలా మంది మాజీ క్రికెటర్లు స్వాగతించారు. అయితే ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టీవ్‌గా ఉంటూ ప్రతి విషయంపై స్పందించే మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం ధోని కెప్టెన్సీ వీడ్కోలుపై ఒక్క కామెంట్ కూడా చేయలేదు.

గంగూలీ 2000లో కెప్టెన్సీ భాద్యతలు స్వీకరించినప్పుడు భారత జట్టు టెస్టు ర్యాంక్ 8 ఉండిందని, కానీ వైదొలిగే సమయానికి ర్యాంక్ 2కి చేరుకుందని ఉన్న ఒక ట్వీట్‌ను మాత్రం రీట్వీట్ చేశాడు సెహ్వాగ్. దీంతో వీరిద్దరికి మంచి సంబంధాలు లేవంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చాయి.
తన కెరీర్ చివర్లో ధోని నేతృత్వంలోని భారత జట్టులో సెహ్వాగ్ చోటు దక్కించుకోవడం చాలా గగనమైపోయింది. దీంతో ధోని కావాలనే జట్టు నుంచి సెహ్వాగ్‌ని తప్పించాడనే వార్తలు అప్పట్లో వచ్చాయి. ఈ కారణంతోనే ధోని కెప్టెన్సీ వీడ్కోలుపై సెహ్వాగ్ స్పందించలేదని నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను వెలిబుచ్చారు.
దీంతో నెటిజన్ల ఊహాగానాలకు తెరదించుతూ ధోని కెప్టెన్సీ వీడ్కోలుపై సెహ్వాగ్ 'క్రికెట్ టాకీస్' అనే వెబ్ సైట్‌కి రాసే కాలమ్‌లో స్పందించాడు. ' ధోని జనవరి 4న వన్డే, టీ20ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. నేను ఊహించిన దానికంటే కొన్ని రోజులు ముందుగానే ఇది జరిగింది. 7 అనే నెంబర్ ధోనికి ఎంతో ఇష్టం. కాబట్టి బ్యాట్స్‌మెన్‌గా, వికెట్ కీపర్‌గా ఇంకా రాణించాలని 7వ తేదీన విష్ చేద్దామని ఆగాను' అని తనదైన శైలిలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
మైదానంలో కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ధోని ఆటతీరు మన అందరికీ తెలిసిందే. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే ధోని పెద్ద మనసున్న ఓ హ్యూమన్ అని సెహ్వాగ్ చెప్పాడు. ధోనితో పాటు అతడి జట్టులోని సభ్యులంతా తల్లి పేర్లను జెర్సీ వెనుక భాగాన రాసుకుని మ్యాచ్ ఆడిన సందర్భాన్ని సైతం సెహ్వాగ్ గుర్తు చేశాడు.
భారత క్రికెట్‌కు ధోని చేసిన సేవలకు అతడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని సెహ్వాగ్ చెప్పాడు. ఇదిలా ఉంటే కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన జనవరి 15 నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరిస్‌కు ధోనిని వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు. కెప్టెన్‌గా భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలనందించాడు.
తన కెరీర్‌లో మొత్తం 199 వన్డేలకు, 72 టీ20లకు, 60 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించిన ధోని ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా ధోనిది ప్రత్యేకమైన స్ధానం. వన్డే ప్రపంచ కప్.. ఛాంపియన్స్ ట్రోఫీ.. టీ20 ప్రపంచ కప్‌లు ఇలా మూడూ సాధించిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయాడు.
అంతేకాదు భారత్ తరుపున ఆరు వరల్డ్ టీ20 టోర్నీలకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఏకైక కెప్టెన్‌గా ధోని ఓ అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు.