హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని. 2007లో టీమిండియాకు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ పేరు సుపరిచితం. కెప్టెన్‌గా తన పదేళ్ల కెరీర్‌లో భారత జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు.
కెప్టెన్‌గా ఎన్నో అద్భుతమైన రికార్డులను సైతం సొంతం చేసుకున్నాడు. ఐసీసీ వరల్డ్ టీ20, ఐసీసీ వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను సాధించిన ఏకైక కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. 2001లో జార్ఖండ్ టికెట్ కలెక్టర్‌గా ఉన్న ధోని 2007 నాటికి క్రికెట్ అభిమానులకు ఆరాధ్యంగా మారిపోయాడు.
2011లో స్వదేశంలో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో భారత్ విశ్వవిజేతగా అవతరించేలా చేశాడు. కెప్టెన్‌గా ఎన్నో గొప్ప రికార్డులన తన పేరిట లిఖించుకున్న ధోనికి చిన్నా పెద్దా తేడా లేకుండా భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు.

వీరిలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ కూడా ఒకడు. తన తండ్రి డాషింగ్ ఓపెనర్ అయినప్పటికీ వీర్‌కి ధోని అంటే ఎక్కువ ఇష్టమట. అంతేకాదు ధోనిపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా వెల్లడించాడు.
ధోని బ్యాటింగ్ చేస్తున్న ఫొటో మాదిరి చిత్రాన్ని పెన్సిల్‌తో తెల్ల కాగితంపై చిత్రించాడు. ఆర్యవీర్ గీసిన ఈ చిత్రాన్ని సెహ్వాగ్ తన ఫేస్‌బుక్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పుడు ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.